విశాఖ జైల్లో కోడి కత్తి శ్రీను ఆమరణ దీక్ష-విజయవాడలో తల్లి, సోదరుడూ..!
2019 ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత, విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన వ్యవహారంలో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అప్పటి నుంచీ జైల్లోనే ఉన్నాడు. శ్రీనివాస్ కు బెయిల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడమే. దీంతో చేసేది లేక శ్రీనివాస్, ఆయన కుటుంబం ఆమరణదీక్షకు దిగుతున్నారు.
కోడి కత్తితో దాడి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఐదేళ్లుగా ఆయన కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అసలు దాడి చేసింది శ్రీనివాస్ కాదని, వైసీపీ నేత మజ్జి శ్రీను అంటూ ఆయన లాయర్లు కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చారు. మరోవైపు సీఎం జగన్ వచ్చి వాంగ్మూలం చెప్తే ఈ కేసును ముగించేందుకు కోర్టు కూడా సిద్ధంగానే ఉంది. అయినా సీఎం జగన్ ముందుకు రాకపోవడంతో శ్రీనుకు బెయిల్ రావడం లేదు. దీంతో ఆయన లాయర్లు, కోర్టు కూడా చేసేదేమీ లేకపోతోంది.

ఈ నేపథ్యంలో విశాఖ జైల్లోనే మగ్గుతున్న జనిపల్లి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహారదీక్షకు దిగాలని నిర్ణయించుకున్నాడు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని, దాని ఆధారంగా తనకు కోర్టు బెయిల్ ఇస్తుందని శ్రీనివాస్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ఆమరణ దీక్షకు దిగుతుండటం సంచలనం రేపుతోంది. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే ఎన్నికల సమయంలో మరింత రచ్చ కావడం ఖాయం గా కనిపిస్తోంది..
మరోవైపు శ్రీనివాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇవాళ్టి నుంచి విజయవాడలోని వారి ఇంట్లోనే ఆమరణ దీక్షకు దిగబోతున్నారు. శ్రీనివాస్ తల్లి, సోదరుడు కూడా అతనికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిరాహారదీక్ష చేపట్టబోతున్నారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం నిరాహారదీక్షల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరుతూ హైకోర్టులో సైతం వైఎస్ జగన్ పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ కేసు ఇప్పట్లో తేలేలా లేదు.












Click it and Unblock the Notifications