YS Jagan : ఏపీ విద్యుత్ సంస్ధలకు అవార్డులు- అధికారులకు జగన్ ప్రశంసలు..
ఏపీలో విద్యుత్ సంస్ధల నష్టాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. నిరంతరం విద్యుత్ ఛార్జీల పెంపుకు విద్యుత్ సంస్ధల నష్టాలే కారణమనే విమర్శలు కూడా ఉంటాయి. అలాంటి విద్యుత్ సంస్ధలు మెరుగైన పనితీరుతో అవార్డులు సాధిస్తే.. అదీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రంలో సంస్ధలు మూడు జాతీయ అవార్డులు కైవసం చేసుకుంటే.. సీఎం జగన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్ధలు జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవడంపై ఆ సంస్ధల ఉన్నతాధికారులను సీఎం వైఎస్ జగన్ ఇవాళ అభినందించారు. విద్యుత్ సమర్ధ వినియోగంలో జాతీయ స్ధాయిలో మూడు అవార్డులు గెలుచుకున్న ఏపీ విద్యుత్ సంస్ధల్ని సీఎం జగన్ ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన 15 వ ఎనర్షియా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు డెవలప్‌మెంట్ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ ఎంపికైంది.

దీంతోపాటు దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఎంపికైంది. అలాగే న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పునరుత్పాదక కార్పొరేషన్‌లలో ఒకటిగా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది. దీంతో ఇందుకు కారణమైన అధికారుల్ని జగన్ తన ఆఫీసుకు పిలిపించి అభినందించారు. అలాగే తన చేతుల మీదుగా మరోసారి వారికి అవార్డులు ఇచ్చారు.

అవార్డులను సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వీసీ మరియు ఎండీ ఎస్. రమణా రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ (హెచ్‌ఆర్‌డీ) ఐ. పృద్వితేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్ధన్ రెడ్డి, పాల్గొన్న చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్) బి.మల్లారెడ్డి చూపించారు.












Click it and Unblock the Notifications