నాకు భయమా.. ఏం కేసులో చెప్పు, ఆ ఆస్తులు తీసుకుంటాం: జగన్‌కు బాబు కౌంటర్
విజయవాడ: తన పైన కేసులున్నా తాను భయపడలేదని, చంద్రబాబు ఓటుకు నోటు కేసు విషయమై భయపడుతున్నారన్న వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం కౌంటర్ ఇచ్చారు. జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అలాగే, ప్రత్యేక హోదా, రాజధాని విషయంలో జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వివరించామని చంద్రబాబు చెప్పారు. విభజనలో జరిగిన అన్యాయాన్ని నీతి అయోగ్‌లో ప్రస్తావించినట్లు చెప్పారు.
విపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. విపక్షాలకు రాజకీయం కావాలని, తమకు రాష్ట్ర అభివృద్ధి కావాలన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తాను కేంద్రానికి గుర్తు చేశామని చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. పట్టిసీమను పూర్తి చేసి రాయలసీమకు నీరు ఇద్దామనుకుంటే, కొందరు రాజకీయం చేస్తున్నారన్నారు. పట్టిసీమ వారంలో పూర్తవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసిందన్నారు.
కృష్ణా నదికి ఇంకా నీరు రాలేదన్నారు. కర్నాటక ప్రాజెక్టుల ఎత్తును పెంచుతోందన్నారు. సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాజధాని విషయంలోను వైసిపి, జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు. రాజధాని ఆపే కుట్ర చేస్తున్నారన్నారు.

అఘాయిత్యాలు వద్దు
ఎవరూ అధైర్యపడవద్దని, అఘాయిత్యాలకు పాల్పడవద్దన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తీవ్ర నష్టం జరుగుతుందని, మరింత నష్టపోతుందని తాను కేంద్రానికి తెలిపానని చెప్పారు. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడికి సమస్యలు వివరించానన్నారు.
తాము ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. జగన్ వంటి నాయకుల వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు చెప్పారు. వారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి వల్ల ఏం ఉపయోగముండదని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాయలసీమలోని వెనుకబడిన జిల్లాలకు కేంద్రాన్ని ప్యాకేజీలు కోరానని చంద్రబాబు చెప్పారు. తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి, ప్రధాని మోడీకి తదితరులకు చెప్పానని తెలిపారు.
నాపై ఏం కేసులున్నాయని భయపడతా
వైయస్ బతికున్నప్పటి నుంచి తాను అవినీతి పైన పోరాటం చేశానని చెప్పారు. అవినీతి ద్వారా లూటీ చేసిన సొమ్ము అంతా ప్రజలకు చెందాల్సిందే అన్నారు. రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేసింది కాంగ్రెస్సే అన్నారు. నేను భయపడేందుకు నా పైన ఉన్న కేసులు ఏమిటో చెప్పాలని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.
వైయస్ ఉన్నప్పుడే తన పైన ఎన్నో కేసులు వేశారన్నారు. కర్నాటక తుంగభద్ర, అల్మట్టి ఎత్తు పెంచే ప్రయత్నం చేస్తోందన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇచ్చి తీరుతామన్నారు. ప్రధానితో తాను దాదాపు గంటన్నరసేపు మాట్లాడానని చెప్పారు. సమస్యలను అధిగమించేలా కార్యక్రమాలు రూపొందించానని చెప్పారు.
గడిచిన ఏడాదిలో ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. పోలవరం ప్రాంతంలోని 200 గ్రామాలలోని వారికి పునరావాసం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గంటలు పని చేస్తానన్నారు. తన సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరికీ భయపడలేదని, భయపడనని, తన తీరు అదేనని చెప్పారు.
కేంద్రంతో సత్సంబంధాల వల్లే, తొందరపడితే నష్టం మనకే
సున్నితమైన సమస్యలను పరిష్కరించి పోలవరం పూర్తి చేయకుంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉండటం వల్లే చాలా పనులు జరిగాయని అభిప్రాయపడ్డారు. తాము ప్రయత్నం చేసేవి అన్నీ రాకపోవచ్చుని చెప్పారు. తాము కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తొందరపడితే నష్టపోయేది మనమే అన్నారు. రాష్ట్రానికి ఆదాయం పెంచే మార్గాలు అన్వేషిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టర్ వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు. తమ హయాంలో రైతుల ఆత్మహత్యలు ఆగాయని చెప్పారు. ఇచ్చిన హామీలన్నింటిని తాము నెరవేరుస్తామన్నారు. నేతలు రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోవద్దన్నారు.
ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు రాబట్టుకుంటాం
ఏపీ భవిష్యత్తులో నెంబర్ వన్‌గా తయారవుతుందని చెప్పారు. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను రాష్ట్రం రాబట్టుకుంటుందని చెప్పారు. అవినీతి ద్వారా లూటీ చేసిన సొమ్ము అంతా ప్రజలకు చెందాల్సిందే అన్నారు. బీహార్ రాష్ట్రానికి ఏపీకి సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications