అవిశ్వాస తీర్మానం: చంద్రబాబు ఎత్తుకు టెక్నాలజీతో జగన్ పైఎత్తు
హైదరాబాద్: అవిశ్వాసం నోటీసు పైన చర్చ విషయంలో అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అవిశ్వాసం విషయంలో విప్ జారీ చేయకుండా ఉండేందుకు టిడిపి సోమవారమే చర్చ చేపట్టేందుకు ఎత్తు వేస్తే.. వైసిపి అధినేత జగన్ పైఎత్తు వేశారు.
సోమవారమే చర్చ చేపట్టడం ద్వారా వైసిపి తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకుండా చేయాలని టిడిపి భావించింది. తద్వారా తమ పార్టీలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. అయితే వైసిపి తాజాగా టెక్నాలజీని ఉపయోగించుకొని విప్ జారీ చేశారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం బీఏసీ సమావేశం ముగియగానే... ఈరోజే చర్చకు టిడిపి తెరలేపడంతో ఎస్సెమ్మెస్‌లు, ఈ మెయిల్స్ ద్వారా తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. అయితే, దానిని చూసుకోలేదని ఎమ్మెల్యేలు చెప్పే అవకాశముందో లేదో తెలియాల్సి ఉంది.

అయితే, విప్ జారీ చేసే అవకాశం తమకు ఇవ్వకుండా టిడిపి వ్యవహరించడంతో... ఇక్కడ వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తెలుగుదేశం పార్టీ క్విక్ రియాక్షన్‌తో సతమతమైన వైసిపి... ఎలాగైనా తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలని తలచింది.
దీంతో, గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పార్టీ తన ఎమ్మెల్యేలకు మొబైల్ ఫోన్ ద్వారా ఎస్సెమ్మెస్, ఈ మెయిల్‌లో విప్ జారీ చేసింది. దీనిపై వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సెమ్మెస్‌లు ఈ రోజు పెట్టలేదని, శుక్రవారమే వాటిని పంపించామని చెప్పారు.
బీఏసీ సమావేశం అనంతరం వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఏడుగంటల సమయం సరిపోదని తాము బీఏసీలో చెప్పామన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామన్నారు.
దీనిపై ఓ రోజంతా చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. రోజంతా చర్చిద్దామన్న తమ వాదనను బీఏసీలో అధికార పక్షం అంగీకరించలేదన్నారు. అయినా తాము తీర్మానంపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. తమకు విప్ జారీ చేసే అవకాశం కూడా ఇవ్వవద్దని భావించారన్నారు.












Click it and Unblock the Notifications