సాయంత్రం ఢిల్లీకి జగన్ - రేపు మోడీ, అమిత్ షాతో భేటీ ? అజెండాపై ఉత్కంఠ !
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి విభజన హామీల అమలుతో పాటు పలు అంశాల్లో కేంద్రం నుంచి సహకారం కరవవుతోంది.
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రేపు ఢిల్లీలో సీఎం జగన్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, విభజన హామీల అమలు, ఇతర అంశాలపై మోడీ-షాతో జగన్ చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వైఎస్ జగన్ ఢిల్లీ టూర్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సీఎం జగన్.. బడ్డెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత క్యాంపు ఆఫీసులో ఢిల్లీలో చర్చించాల్సిన అంశాలపై నేతలు, అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి కావడం, విభజన హామీల అమలులో కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడం, మరోసారి ఎన్నికలకు వెళ్లబోతున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఈ నాలుగేళ్లలో ఎన్నోసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా కేంద్రం నుంచి ఏమీ రాబట్టుకోలేకపోయారన్న విమర్శల నేపథ్యంలో జగన్ మరోసారి హస్తిన వెళ్లబోతుండటం ఉత్కంఠ రేపుతోంది.

విభజన హామీలపై మరోసారి
కేంద్రం మెడలు వంచి విభజన హామీలు అమలు చేయిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ విషయంలో ముందడుగు వేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తివంటి హామీలను అమలు చేయాలంటూ మరోసారి కోరేందుకు జగన్ సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉన్నందున విభజన హామీల్లో కొన్నైనా అమలు చేయాలని జగన్ కోరబోతున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తగ్గిపోవడం, రెవెన్యూ లోటు పెరుగుతుండటం, వెనుక బడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. వీటిలో కొన్నయినా అమలు చేసేలా కేంద్రంపై జగన్ ఒత్తిడి పెంచనున్నారు.

రాజధానులపై ఒత్తిడి ?
ఏపీలో మూడు రాజధానుల అమలు విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. కేంద్రం నుంచి తగిన సహకారం లేకపోవడంతో రాజధానులపై కోర్టుల్లోనూ సానుకూల పరిస్ధితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం వైపు నుంచి తగిన చర్యలు తీసుకోవాలని జగన్ మరోసారి ప్రధాని, హోంమంత్రిని కోరబోతున్నారు. అలాగే రాష్ట్రంలో వివేకా హత్య కేసుతో పాటు ఇతర అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్ధల తీరుపైనా వారితో చర్చించే అవకాశముంది. ముఖ్యంగా సీబీఐ తీరుపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ.. బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పుడు అవే అంశాల్ని జగన్ కేంద్రం వద్ద ప్రస్తావించే అవకాశముంది.












Click it and Unblock the Notifications