అంకెల గారడి, అంతా దాచి పెట్టే ప్రయత్నమే: బడ్జెట్‌పై వైయస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ నిరాశకు గురిచేసిందని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఆయన సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ అంతా దాచిపెట్టే ప్రయత్నమే తప్ప.. ఏమీ కనిపించే అవకాశాల్లేవని మండిపడ్డారు.
బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని, వీలైనంతవరకు అన్నీ దాచిపెట్టే ప్రయత్నం చేశారని జగన్ విమర్శించారు. బడ్జెట్ అంతా అంకెల గారడీయేనని, అన్నీ గొప్పలు చెప్పుకొన్నారని మండిపడ్డారు. బడ్జెట్ లో అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు ఈ ఏడాది ఏం చేస్తారో చెప్పలేదని అన్నారు.ఫలానా పథకానికి గొప్పగా కేటాయింపులు చేశామని చెప్పుకొనే పరిస్థితి లేదని అన్నారు.

బడ్జెట్ అంశాలపై పూర్తిగా లోతుల్లోకి వెళ్లలేదని, దీనిపై మార్చి 16న మరోసారి స్పందిస్తానని చెప్పారు. కొత్తగా జీరో బేస్డ్ బడ్జెట్ అన్నారు గానీ..గతంలో చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్నప్పుడు కూడా చేశారన్నారు. అప్పుడు జీరో బేస్డ్ బడ్జెట్ విఫలం కావడంతో ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారని గుర్తు చేశారు.
వ్యవసాయ రుణాలకు ఎంత ఇచ్చారు? ఎంత ఇవ్వబోతారో చెప్పలేదని అన్నారు. శాఖల వారీగా రెవెన్యూ ఎంత వచ్చింది?, ఎంత ఖర్చు చేశారన్నది లోతుగా చూడాల్సి ఉందని జగన్ చెప్పారు. డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ ఎంతో లేదని అన్నారు. గతం గురించి చెప్పారు గానీ, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో చెప్పనేలేదని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications