ఐప్యాక్ టీమ్ తో సీఎం జగన్ భేటీ ! ముందస్తు, ఎన్డీయేలోకి వైసీపీ ప్రచారాల నేపథ్యంలో ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆలోపే ఈ ఏడాది డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఇవాళ తన నివాసంలో ఐప్యాక్ టీమ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్దితులు, తాజా పరిణామాలపై వారితో చర్చిస్తున్నారు.

ఏపీలో వైసీపీ వర్సెస్ వివక్షాలుగా రాజకీయం మారిపోయింది. అదే సమయంలో సంక్షేమాన్ని ప్రజల్లోకి భారీ ఎత్తున తీసుకెళ్లడం ద్వారా మరోసారి ఓటు అడగాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం పలు కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇంత చేస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు ఇంకా ఉత్సాహంగా పనిచేయడం లేదనేది ఐప్యాక్ రిపోర్ట్. దీంతో సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు యాక్టివ్ గా ఉండే వారికే మరోసారి టికెట్లు ఇస్తానని తేల్చిచెప్పేస్తున్నారు.
అలాగే ఎప్పటికప్పుడు ఐప్యాక్ టీమ్ నుంచి రిపోర్టులు తెప్పించుకుంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో తాజా పరిస్ధితిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి ఐప్యాక్ బృందంతో సీఎం జగన్ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలోనూ వైసీపీ ఎమ్మెల్యేల తాజా గ్రాఫ్, రాష్ట్రంలో విపక్ష నేతల వరుస టూర్లతో మారుతున్న పరిస్దితులపై రిపోర్టులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు లోక్ సభతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలు జరిపేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలు జరిపించాలని ప్రధానిని కోరినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే వైసీపీ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించింది. తాజాగా వైసీపీ నేత సజ్జల కూడా ముందస్తు లేదని మరోసారి తేల్చిచెప్పేశారు.
దీంతో ముందస్తుపై వైసీపీ ఆసక్తిగా లేదని అర్ధమవుతోంది. అయితే కేంద్రం ఒత్తిడి చేస్తే తప్పనిసరి పరిస్ధితుల్లో వెళ్లాల్సి ఉంటుందనే భావనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐప్యాక్ టీమ్ తో జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications