ఏపీలో విద్యుత్ బస్సులు-ఉద్యోగుల తొలగింపుపై APSRTC క్లారిటీ..!
ఏపీలో విద్యుత్ బస్సుల్ని తీసుకొచ్చి, డిపోల్ని ప్రైవేటు సంస్థలకు లీజులకు ఇచ్చి, ఉద్యోగుల్ని కూడా తొలగించబోతున్నారన్న ఆందోళనలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ (APSRTC) ఇవాళ ఆయా అంశాలపై స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద మొత్తం 10,661 బస్సుల సామర్ధ్యం ఉందని, వీటిలో 8,012 ఆర్టీసీ బస్సులు, 2,649 అద్దె బస్సులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ప్రకారం 2029 నాటికి ఆర్టీసీలో అన్ని బస్సుల్ని విద్యుత్ బస్సులుగా మార్చాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో అన్ని కేటగిరీల బస్సుల కొనుగోళ్లు ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల రూపంలోనే జరగాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని గుర్తుచేసారు.
ఎలక్ట్రిక్ బస్సుల వల్ల దిగుమతి చేసుకునే ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయని, పర్యావరణహితమైన, కాలుష్య రహిత రవాణా వ్యవస్థను అందిస్తాయని, దీర్ఘకాలంలో ఇంధన, నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గిస్తాయని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పిస్తాయని కూడా పేర్కొన్నారు. భారత ప్రభుత్వ ఫేమ్-2పథకం కింద ఆర్టీసీలో 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ బస్సులు తిరుపతి-తిరుమల, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-కడప, మదనపల్లె మార్గాలలో విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. వీటి నిర్వహణకు విద్యుత్ ఛార్జీలతో కలిపి కిలోమీటరుకు ₹49.43 చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు జీసీసీ విధానంలోనే చేపడుతున్నారని, ఇందుకు కొన్ని కీలక కారణాలు ఉన్నాయని వారు తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో పరిపక్వత సాధించలేదని, 2-3 సంవత్సరాల తరువాత బ్యాటరీ సామర్థ్యం తగ్గడంతో బస్సుల రేంజ్ తగ్గడం, కిలోమీటరుకు విద్యుత్ వినియోగం పెరగడం జరుగుతుందని తెలిపారు. ఒక్క ఎలక్ట్రిక్ బస్సు ప్రారంభ వ్యయం సుమారు రూ.1.50 కోట్లు. క్యాపెక్స్ విధానంలో కొనుగోలు చేస్తే భారీ మూలధన వ్యయం అవసరమన్నారు. ఆర్టీసీలో ఇప్పటికే అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరత ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ సేవ పథకం కింద 11 నగరాలకు 1,050 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేయగా.. వీటిని 16 డిపోలలో నడపనున్నారు. వీటిలో 750 బస్సుల టెండర్లు CESL ద్వారా GCC విధానంలో పూర్తయ్యాయి. మిగిలిన 300 బస్సుల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడం వల్ల ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని ఆర్టీసీ తెలిపింది. ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించే ఉద్దేశంతో భవిష్యత్తులో డ్రై లీజ్ విధానాన్ని కూడా ఆర్టీసీ పరిశీలిస్తోంది. ప్రజా రవాణా సేవలను ఆధునికీకరిస్తూనే ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. ఉద్యోగుల జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సుమారు రూ.350 కోట్లు చెల్లిస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను నిర్వహించే సంస్థలకు ఒప్పంద కాలంలో గ్యారేజ్ స్థలాన్ని కేవలం ఛార్జింగ్, నిర్వహణ అవసరాలకే వినియోగించుకునే అనుమతి ఉంటుంది. ఆ స్థలం పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యానిదే. ఒప్పందం ముగిసిన తర్వాత సంబంధిత సంస్థ ఖాళీ చేయాల్సి ఉంటుంది.
750 ఎలక్ట్రిక్ బస్సులు గాజువాక, సింహపురి, కాకినాడ, రాజమహేంద్రవరం, విద్యాధరపురం, మంగళగిరి, గుంటూరు-2, నెల్లూరు-2, మంగళం, కడప, కర్నూలు-2, అనంతపురం డిపోల ద్వారా నడుపుతున్నట్లు వెల్లడించారు.ఈ 12 డిపోలలో విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2 , మంగళం డిపోలలో ఒక్కో డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే ప్రణాళిక ఉందన్నారు. విద్యుత్, సివిల్ మౌలిక సదుపాయాల పనులు ప్రారంభమైనందున విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2 , మంగళం డిపోలలో పనిచేస్తున్న ఉద్యోగులను తాత్కాలికంగా పునర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. ఈ 4 డిపోలలో ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే కండక్టర్లను తిరిగి అదే డిపోలకు తీసుకువస్తారన్నారు. డ్రైవర్లు, మెకానిక్‌లను పరిపాలనా అవసరాలకు అనుగుణంగా సమీప డిపోలలో పునర్వినియోగం చేస్తారన్నారు. సింహపురి, కుప్పం ప్రాంతాల్లో అదనపు భూములు కేటాయించగా, తిరుమల, తిరుపతి మరియు ఇతర ప్రాంతాల్లో కూడా భూముల కేటాయింపు పరిశీలనలో ఉందన్నారు.

సింహపురి, రాజమహేంద్రవరం డిపోలలో ఒక్కో డిపోకు రూ.15 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ బస్ డిపోలు ఏర్పాటు చేస్తామని,
అదనంగా 903 బస్సులకు ఇప్పటికే ఆమోదం లభించిందని తెలిపారు. మిగులు డ్రైవర్లకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఆర్టీసీ డ్రై లీజ్ విధానంలో ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లను ఆహ్వానిస్తోందన్నారు. APSRTC డిపోలను ఏ ఎలక్ట్రిక్ బస్సు ఆపరేటర్‌కు లీజుకు ఇవ్వడం లేదని, అన్ని నిబంధనలు CESL రూపొందించిన టెండర్ షరతుల ప్రకారమే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు సమానంగా అమలులో ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తు ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖాళీ స్థలాల్లో అవసరానికి అనుగుణంగా అదనపు సివిల్, విద్యుత్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాలను పాలనా సౌలభ్యానికి అనుగుణంగా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని తెలిపారు.














Click it and Unblock the Notifications