బాబుకు అమిత్ షా ఫోన్: వ్యూహం మార్చిన జగన్, పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టే ప్లాన్
Recommended Video

ఒంగోలు/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరుకున పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రయత్నించారు. పవన్ సలహాతోనే తాము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని చెప్పారు.
ఆయన ప్రకాశం జిల్లాలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, తెలుగుదేశం పార్టీ మద్దతు, బీజేపీతో దోస్తీ తదితర అంశాలపై స్పందించారు.

21న అవిశ్వాస తీర్మానం
ఈ నెల 21వ తేదీన మోడీ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని జగన్ మరోసారి చెప్పారు. పవన్ సూచించారని, అందుకే ఈ తీర్మానం పెడుతున్నామని చెప్పారు. అవిశ్వాసంలో టీడీపీ కూడా తమతో కలిసి రావాలని చెప్పారు. టీడీపీ ఎంపీలు మద్దతిచ్చేలా చూడాల్సిన బాధ్యత పవన్‌దే అన్నారు.

ఆ బాధ్యత వారిదే
తమ అవిశ్వాస తీర్మానానికి ఇరవై మంది ఎంపీలు మద్దతిచ్చేలా చూడాల్సిన బాధ్యత పవన్, చంద్రబాబులదే అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే వరకు అసెంబ్లీకి వెళ్లమని కూడా జగన్ తేల్చి చెప్పారు. అయితే రాజ్యసభ ఎన్నికల కోసం ఒకరోజు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

జగన్ దూకుడు అందుకేనా
పవన్ సూచన మేరకు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు జగన్ కూడా ఉవ్వీళ్లూరుతున్నట్లుగా కనిపిస్తోంది. అయితే అది వ్యూహాత్మకమా లేక బీజేపీ మళ్లీ టీడీపీకి దగ్గరవుతున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీలతో పాటు పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టాలని జగన్ భావిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

చంద్రబాబు తగ్గడం లేదు
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేకపోవడం, ప్రత్యేక హోదా బదులు ఇస్తామని చెప్పిన ప్యాకేజీ సరిగా అమలు చేయకపోవడంతో టీడీపీ, చంద్రబాబులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవసరమైతే బీజేపీతో తెగదెంపులకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.

తెగదెంపులకే టీడీపీ
శుక్రవారం చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీ నేతలు మాట్లాడిన తీరును చూస్తే బీజేపీతో తెగదెంపులకే సిద్ధమవుతున్నట్లుగా కనిపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రంగంలోకి దిగి స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేయడం గమనార్హం.

జగన్ రూటు మార్చారా
సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు రావడం, మిత్రపక్షాలు దూరమవుతున్న నేపథ్యంలో టీడీపీ ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకే అమిత్ షా చర్చలకు పిలిచారని అంటున్నారు. బీజేపీ, టీడీపీలు ఒక్కటవుతున్న నేపథ్యంలో జగన్ రూటు మార్చి బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్‌ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications