నెల్లూరులో అందుకే ఓడాం - అనిల్ కు జగన్ కీలక బాధ్యతలు..!!
వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుసగా జిల్లాల వారీగా సమీక్షల్లో భాగంగా నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సమావేశమయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఓటమి వెనుక కారణాలను విశ్లేషించారు. నియోజకవర్గాల వారీగా ఫలితాల పైన నేతలు నివేదికలు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడి నియామకంతో పాటుగా నెల్లూరు సిటీ బాధ్యతలు తిరిగి అనిల్ కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఓటమి వెనుక
నెల్లూరు జిల్లా నేతలకు జగన్ దిశా నిర్దేశం చేసారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీతో సహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు సాధించిన వైసీపీ తాజా ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ ఓడిపోయింది. పార్టీ ఏర్పాటు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు అండగా నిలిచారు. అయితే, ఇప్పుడు పార్టీ ఓటమికి కారణాల పైన జిల్లా నేతలతో జగన్ సమీక్షించారు. ఎంపీగా పోటీ చేసిన విజయ సాయిరెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షలో వివరించారు.

అనిల్ కు మరోసారి
జిల్లాలో పలు నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల వేళ మార్పు చేసారు. నెల్లూరు నగరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ ను నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయించారు. ఆయన అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి అనిల్ కు నెల్లూరు సిటీ సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ బాధ్యతలను మాజీ ఎంపీ ఆదాల చూడాలని జగన్ సూచించారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన అజీజ్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
జిల్లా బాధ్యతలు
ఇక..నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల పైన జగన్ పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ప్రతిపాదన రాగా.. కొందరు నేతలు ఆయన జిల్లా కాకుండా కేవలం తన నియోజకవర్గం సర్వేపల్లికే పరిమితం అయ్యారని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో..జిల్లా అధ్యక్ష బాధ్యతల ఖరారు పైన నిర్ణయం తనకు వదిలేయాలని జగన్ వ్యాఖ్యానించారు. ఇక..కూటమి ప్రభుత్వం పైన క్రమేణా ప్రజల్లో వ్యతిరేక పెరుగుతోందని.. ప్రజలతో మమేకం అవుతూ ముందుకు వెళ్లాలని..పార్టీకి భవిష్యత్ ఉందని జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications