ఆ నాలుగు జిల్లాలపై జగన్ గురి - ప్రక్షాళన, కీలక మార్పులు..!!
మాజీ సీఎం జగన్ పార్టీ పై ఫోకస్ చేసారు. ఎన్నికల్లో ఊహించని పరాజయంతో పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. కీలక పదవుల్లో మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్దులతో జగన్ సమావేశమయ్యారు. ఇక..జిల్లాల వారీగా పార్టీలో చేయాల్సిన మార్పులను మొదలు పెట్టారు. పులివెందుల కేంద్రంగా ఆపరేషన్ వైసీపీ రాయలసీమ ప్రారంభించారు. ముఖ్య నేతల తో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
పార్టీ ప్రక్షాళన
వైసీపీ అధినేత జగన్ పులివెందుల వేదికగా పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తరువాత తొలి సారి జగన్ సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు. అయిదు రోజుల పాటు ఇక్కడే జగన్ ఉండనున్నారు. కుటుంబ వ్యవహారాలతో పాటుగా పార్టీ సమావేశాల్లో జగన్ పాల్గొంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి రాయలసీమ ప్రాంతం కంచుకోటగా ఉంది. కడప ఎంపీగా జగన్ రికార్డు మెజార్టీతో గెలవటం మొదలు ఉప ఎన్నికలు, 2014..2019 ఎన్నికల్లోనూ రాయలసీమలోనే జగన్ మెజార్టీ స్థానాలు గెలుస్తూ వచ్చారు. కానీ, 2024లో సీన్ రివర్స్ అయింది.

వరుస భేటీలు
జగన్ సొంత జిల్లా కడపలోనూ అనూహ్య ఫలితాలు వచ్చాయి. దీంతో, జగన్ అంచనాలు తలకిందులు అవ్వటంతో భవిష్యత్ పై జగన్ అలర్ట్ అయ్యారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. భరోసా కల్పిస్తున్నారు. ఓటమి బాధ వీడాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ పుంజుకుంటుందని విశ్వాసం పెంచుతున్నారు. ఇదే సమయంలో పులివెందుల కేంద్రంగా రాయలసీమ లోని 52 నియోజకవర్గాల్లో పార్టీకి వచ్చిన ఓట్లు..ఓటమి కారణాల పైన జగన్ ముఖ్య నేతలతో విశ్లేషించనున్నారు. తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించనున్నారు.
కీలక చర్యలు
ముఖ్యంగా ఈ స్థాయిలో రాయలసీమలోనూ వ్యతిరేకత కనిపించటానికి కారణాల పై జగన్ ఆరా తీస్తున్నారు. నాలుగు జిల్లాల ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు. జిల్లాల వారీగా కడప నుంచే సమీక్ష మొదలు పెట్టనున్నారు. అదే సమయంలో కేడర్ తో వచ్చిన గ్యాప్ భర్తీ..ప్రజలతో తిరిగి మమేకం అవ్వటం.. పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన మార్పుల పైన జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ముందుగా పట్టున్న సీమ ప్రాంతం నుంచే పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications