చిరు బాటలోనే జగన్, బోర్డు తిప్పేయడమే: సిఎం రమేష్
కడప: పార్టీ కార్యాలయాన్ని మూసివేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తన ఇంటికి కార్యాలయాన్ని మార్చుకోవడాన్ని చూస్తే చిరంజీవి బాటలో పయనిస్తున్నట్లు స్పష్టమవుతున్నదని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. ఆయన మంగళవారం కడపలో మీడియాతో మాట్లాడారు. పార్టీ పెట్టిన చిరంజీవి రెండు సంవత్సరాలకే బోర్డు తిప్పేసి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన సంగతి తెలిసిందేనన్నారు. ప్రస్తుతం జగన్ కూడా కార్యాలయాన్ని ఎత్తివేసి ఇంటికి మార్చుకోవడం చూస్తుంటే ఆయన పార్టీ ఖాళీ అవుతున్నట్లు స్పష్టమవుతున్నదన్నారు. త్వరలో మరో పార్టీలో విలీనమయ్యే సంకేతాలు గోచరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

జగన్ ఎన్ని జన్మలెత్తాలో...
జగన్ జైలు జీవితం పూర్తి చేయాలంటే ఎన్ని జన్మలెత్తాలోనని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి పేర్కొన్నారు. కమలాపురంలో ఎంపీ రమేష్‌నాయుడు, పుత్తాతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 60 కోట్లు అవినీతి కేసులో జయలలితకు 100 కోట్లు జరిమానా , నాలుగేళ్ల జైలు శిక్ష పడిందన్నారు. లక్ష కోట్లు అవినీతి చేసిన ఆ ప్రకారం 1.70 లక్షల కోట్లు జరిమానాతో 6 వేల సంవత్సరాలపైగా జైలు జీవితం గడపాలన్నారు. అలాగే కొద్ది రోజుల ముందు నరకాసురవడ పేరుతో వైసీపీ పార్టీ నిరసన చేపట్టిందని ప్రజలు ఎవరూ స్పందించలేదన్నారు.
పథకాలు ఆపేయాలనే జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు, పేదలకు న్యాయం జరగడం ఇష్టంలేక ఎలాగైనా సంక్షేమపథకాలను ఆపివేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆందోళనలకు దిగుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామగోపాల్‌రెడ్డి విమర్శించారు. ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడారు. ప్రజలను చంద్రబాబు వంచన చేశాడు, దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తామనడం అర్థరహితమన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి రూ. 1.50లక్షల అప్పును మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దానికి సంబంధించి రైతు సాధికారిత కార్పొరేషన్‌ను స్థాపించారని చెప్పారు. దానికి తొలివిడతగా రూ. 5వేల కోట్ల మూలనిధిని కేటాయించినట్లు తెలిపారు. పరిపాలన అనేది అనేక సమస్యలతో కూడికొని ఉంటుందని, ఎద్దు ఈనిందంటే గాటిన కట్టేయమనే చందంగా ఉండదన్నారు.
ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే అసలు రైతులకు లబ్ది జరగకుండా, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అన్యాయంగా లబ్దిపొందిన బినామి రైతులు లబ్ది పొందుతున్నారన్నారు. గత 4 నెలల నుంచి బ్యాంకులపై ఒత్తిడి తెస్తున్నా వారు ప్రభుత్వానికి సహకరించడంలేదన్నారు. మరికొన్ని రోజుల్లోనే రైతులందరికి రుణమాఫీ సొమ్ము వస్తుందన్నారు. ఏనాడు రైతుల గురించి, రైతు సమస్యలను గురించి పోరాడని జగన్ కేవలం రాజకీయ దురుద్దేశంతో ధర్నాలు చేస్తామనడం విడ్డూరమన్నారు.
వృద్దులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్ సొమ్మును పెంచడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. జగన్ ముందుగా తాను నెలకొల్పిన భారతి సిమెంట్ కర్మాగారంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా పులివెందుల ప్రాంత రైతులు పడుతున్న కష్టాల గురించి జగన్ ఏనాడయినా స్పందించాడా అని ప్రశ్నించారు. ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని సహించలేక జగన్ ధర్నాలకు దిగుతున్నాడన్నారు.












Click it and Unblock the Notifications