మోడీ బాటలోనే జగన్ సర్కార్ -అక్కడ యూపీఏ, ఇక్కడ టీడీపీ- మిగతాదంతా సేమ్ టూ సేమ్
గతంలో ఏదైనా ప్రభుత్వ హయాంలో ఓ తప్పిదం జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే అంశంపై దృష్టిసారించేది. వీలు కాకపోతే తాత్కాలికంగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలు వెతికేవి. ఇందులో తమ ప్రభుత్వ హయాంలో చేసిన మిగతా పనుల్ని తెరపైకి తెచ్చి విపక్షాల విమర్శల నుంచి ఊరట పొందేది. ఇప్పుడు కాలం మారింది. ప్రభుత్వాల తీరు మారింది. తమ ప్రభుత్వ హయాంలో ఏదైనా సమస్య ఎదురుకావడం మొదలు దాన్ని పాత ప్రభుత్వాలపైకి నెట్టేసి బయపడేందుకుప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో మోడీ సర్కార్ తో ఏపీలో జగన్ సర్కార్ పోటీపడుతోంది.

మారిన సిలబస్
గతంలో రాజకీయ పార్టీలు, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు తమకు ఓటేసిన ప్రజలకు బాధ్యత వహించే విషయంలో కాస్తో కూస్తో భయపడేవి. ఇప్పుడా భయం మొత్తం పోయింది. ఐదేళ్లకోసారి బతిమాలో, భయపెట్టో ఓట్లు వేయించుకోవడం, గెలిచి అధికారంలోకి వచ్చాక తిరిగి ఆ జనం నెత్తిన పన్నులు, ఇతరత్రా బాదుడు మొదలుపెట్టేయడం, అడిగితే గత ప్రభుత్వాల్లో అలా చేయలేదా అని ఎదురుప్రశ్నలు వేయడం.. ఇఫ్పుడు మారిన రాజకీయాల సిలబస్ ఇదే. దీన్ని ఓ రేంజ్ లో వంటబట్టించుకున్న రాజకీయ నేతలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మానేసి ప్రత్యర్ధుల కోసమే పనిచేస్తున్నట్లు అర్ధమవుతోంది.

మోడీ సర్కార్ తీరు
కేంద్రంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి చేసుకోవడం, తిరిగి ఎన్నికై మరో రెండేళ్లు పూర్తి చేసుకోవడం కూడా జరిగిపోయాయి. అంటే మొత్తం ఏడేళ్ల పాటు ఎన్డీయే అదికారంలో ఉంది. గతంలో యూపీఅఏ సర్కార్ చేసిన తప్పిదాలకు జనం వారిని శిక్షించి ఎన్డీయేను నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్డీయే సర్కార్ చేస్తున్న తప్పిదాలు చూస్తుంటే యూపీఏ సర్కార్ ను మించిపోతున్నాయి. ముఖ్యంగా తమకు నచ్చనివారిని టార్గెట్ చేసేందుకు మోడీ సర్కార్ ప్రయోజిస్తున్న ఉపా, జాతీయ భద్రతా చట్టాలు, రాజద్రోహ చట్టం, కేంద్ర దర్యాప్తు సంస్ధల కేసులు చూస్తుంటే గతంలో దేశంలో ఏ ప్రభుత్వం కూడా ప్రత్యర్ధులపై ఇన్ని అస్త్రాలు వాడలేదనే విషయం అర్ధమవుతుంది.

జగన్ సర్కార్ తీరు
ఏపీలో రెండేళ్ల క్రితం తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా ప్రత్యర్ధుల్ని భయంకరంగా టార్గెట్ చేస్తోంది. తమ ప్రభుత్వంపై గొంతెత్తిన వారిపై సీఐడీ కేసులు, ఏసీబీ కేసులు, ఎస్ఈబీ కేసులు, రాజద్రోహం కేసులు, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టేస్తోంది. చివరికి ఈ క్రమంలో రాజధాని అమరావతిలో ఎస్సీలపై సైతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టి పోలీసులు అభాసుల పాలయ్యారు. ప్రత్యర్ధుల్ని అణగదొక్కేందుకు కేసుల్నే ఆయుధాలుగా మార్చుకుంటున్న వైసీపీ సర్కార్.. మధ్యమధ్యలో దాడులతో వారిని భయభ్రాంతుల్ని చేస్తోంది. తాజాగా టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం.

తప్పుల్ని యూపీఏపై నెట్టేస్తున్న మోడీ
ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ.. తాజాగా సీబీఐ, సీవీసీలతో జరిగిన భేటీలో అధికారులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత యూపీఏ సర్కార్ తప్పిదాల వల్లే దేశంలో అవినీతి కొనసాగుతోందన్నారు. తద్వారా యూపీఏ హయాంలో అవినీతిని అరికట్టకపోవడం వల్లే ఎన్డీయే వచ్చి ఏడేళ్లవుతున్నా అవినీతిని తగ్గించలేకపోతున్నట్లు మోడీ ఓ విచిత్ర వాదనతో ముందుకొచ్చారు. మోడీ మాటలు విన్న సీబీఐ, సీవీసీ ఛీఫ్ లే ఆశ్చర్యపోయారు. మరి ఈ ఏడేళ్లలో మోడీ సర్కార్ ఏం చేసిందనే ప్రశ్నలు దాని వెంటే తెరపైకి వచ్చేశాయి. దానికి మాత్రం మోడీ దగ్గరే కాదు ఏ కేంద్రమంత్రీ, బీజేపీ నేత దగ్గరా సమాధానం దొరకడం లేదు. గత యూపీఏ సర్కార్ తప్పిదాలు చేయడం వల్లే ప్రజలు తామేదో ఉద్ధరిస్తామని ఎన్డీయేకు ఓటేశారన్న కనీస ఇంగితం కేంద్రానికి లేకుండా పోతోంది.

తప్పులన్నీ టీడీపీవేనంటున్న జగన్
తన ప్రభుత్వంలో విద్యుత్ సమస్య వచ్చినా, విద్యార్ధుల సమస్య వచ్చినా, స్కూళ్ల గురించి అడిగినా, ఆస్పత్రుల గురించి అడిగినా, చివరికి అప్పుల గురించి అడిగినా ప్రస్తుతం జగన్ సర్కార్ కూడా టీడీపీ పాట పాడుతోంది. టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాల వల్లే రాష్ట్రానికి ఈ దుస్ధితి వచ్చిందని వైసీపీ నేతలు అలవోకగా చెప్పేస్తున్నారు. వాటిని సరిదిద్దేందుకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికారంలో రెండేళ్లు పూర్తయిపోతున్నా తాము ఏం చేయలేకపోయామనే అంశాన్ని లౌక్యంగా కనుమరుగు చేసి, ఇంకా పాత ప్రభుత్వంపైనే విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేసేస్తోంది. తాజాగా ఎయిడెడ్ స్కూళ్ల విషయంలోనూ టీడీపీ ప్రభుత్వం వల్లే ఎయిడెడ్ స్కూళ్లకు ఈ దుస్ధితి పట్టిందంటూ మంత్రులు చేస్తున్న ఎదురుదాడి చూస్తుంటే దీన్ని సరిదిద్దే మార్గాలు ప్రభుత్వం వద్ద లేవనే సత్యం అందరికీ అర్ధమవుతోంది.
Recommended Video

ఆడలేక మద్దెల ఓడు
తమ ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన తప్పిదాల వల్ల ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంటే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇంకా పాత ప్రభుత్వాలపై నెపం మోపి తప్పించుకునేందుకు చూస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో ఎన్డీయే అయినా రాష్ట్రంలో వైసీపీ అయినా తమ ప్రభుత్వాల హయాంలో పాత ప్రభుత్వాల తప్పుల్ని సరిదిద్దే క్రమంలో ప్రజాభిప్రాయాన్ని గుర్తిస్తే ఇలాంటి విమర్శలు, ఎదురుదాడులు చేయాల్సిన అవసరం ఉందడన్న సత్యాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది. అలా కాకుండా అధికారంలో ఉన్న తాము చేయాల్సిన పరిష్కారాలకు సైతం చేయకుండా పాత ప్రభుత్వాల్ని విమర్శిస్తూ కూర్చుంటే జనం పాత ప్రభుత్వాల లాగే వీరినీ సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications