ఏపీ హైస్కూళ్లలోనూ ఇంటర్ ? కీలక నిర్ణయం దిశగా జగన్ సర్కార్..!
ఏపీలో విద్యారంగంలో ఈ నాలుగేళ్లలో ఎన్నో సంస్కరణలు అమలు చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. పాఠశాల విద్య నుంచి ఇంటర్, డిగ్రీ విద్య వరకూ పలు సంస్కరణల ద్వారా మార్పులు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అదే కోవలో మరో నిర్ణయం తీసుకోబోతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్కూళ్లలో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్య ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో అందుబాటులో ఉంది. దీన్ని మరింతగా విస్తరించి స్కూళ్లలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలోని ఎంపిక చేసిన హైస్కూళ్లలో పదో తరగతితో పాటు ఇంటర్ విద్య కూడా అందుబాటులోకి వస్తుంది. అప్పుడు విద్యార్ధులు స్కూళ్ల నుంచి ఇంటర్ కోసం సుదూరంలో ఉన్న కాలేజీలకు వెళ్లాల్సిన బాధ తప్పుతుంది.

అలాగే రాష్ఠ్రంలోని స్కూళ్లలో జగనన్న గోరుముద్ద పేరుతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్ధులకు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. హైస్కూళ్లలో ఇంటర్ విద్య ప్రవేశపెట్టడంతో పాటు వారికి కూడా మధ్యాహ్న పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న అసెంబ్లీలో హింట్ ఇచ్చారు. ప్రభుత్వం దీనిపై త్వరలో గుడ్ న్యూస్ చెబుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఎంపిక చేసిన హైస్కూళ్లలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించాలని చూస్తున్నట్లు విద్యామంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. నిన్న అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే దీనిపై త్వరలో శుభవార్త వింటారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం మరో విద్యాసంస్కరణకు సిద్దమవుతున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications