YS Jagan: అసెంబ్లీకి హాజరుపై జగన్ తాజా నిర్ణయం..! విపక్ష హోదాపైనా..!
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి విపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.. ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి హాజరైన జగన్ (ys jagan), ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశానికి కూడా జగన్ హాజరు కాలేదు. ఇవాళ మాత్రం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. అనంతరం కీలక నిర్ణయం ప్రకటించారు.
వైఎస్సార్సీపీకి విపక్ష పార్టీ హోదా ఇవ్వనందుకు నిరసనగా.. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా దూరంగా ఉండాలని జగన్ నిర్ణయించారు. అయితే అసెంబ్లీలో మాత్రమే విపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా శాసనసభకు మాత్రమే ఎమ్మెల్యేలు హాజరుకాకూడదని నిర్ణయించారు. దీంతో మండలికి మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా శాసనమండలిలో గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

మనకు అసెంబ్లీలో బలం తక్కువ, అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని, సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్షనేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుందన్నారు. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి బయట మీడియాతో మాట్లాడుతున్నామని, ఆధారాలతో సహా అన్నీ వివరిస్తున్నామన్నారు.

మరోవైపు కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారిందని, ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారని జగన్ వారికి తెలిపారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమి 54 ఎకరాలు గీతమ్ వర్సిటీకి ఇచ్చేశారని, ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఎవరూ ఇలా ఇచ్చుకోలేదన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోందని, అదే 'క్యాష్.. సూట్‌కేసు.. రాజేష్.. లోకేష్.'. అన్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలని ఎమ్మెల్సీలకు సూచించారు. కళ్లు మూసి తెరిచేలోపు మూడేళ్లు గడుస్తాయని, వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి కూడా అన్నారు. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం మీకు ఉందన్నారు.












Click it and Unblock the Notifications