మంత్రులతో జగన్ చిట్ చాట్- ముందస్తు ప్రచారంపై కీలక వాఖ్యలు..
ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఈ ప్రచారం ఢిల్లీ వర్గాల్లో మొదలైంది. అనంతరం ఏపీలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చాక దీనికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లు కనిపించింది. అయితే ఇంకా పలు చోట్ల ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీపైనా దీని ప్రభావం పడింది.
ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీ తర్వాత సీఎం జగన్ ను మంత్రులు ఇదే అంశంపై ప్రశ్నించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోందని జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై జగన్ స్పందించారు. ఈ ప్రచారాల్ని పట్టించుకోవద్దని మంత్రులకు సూచించారు. అవన్నీ వదిలేసి వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రుల్ని కోరారు. మిగతా విషయాలు తనకు వదిలిపెట్టమన్నారు. దీంతో మంత్రులకు క్లారిటీ వచ్చినట్లయింది.

మరోవైపు కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో మాట్లాడుతూ సీఎం జగన్.. జగనన్న సురక్ష కార్యక్రమం బాగా జరిగిందని కితాబిచ్చారు. అయితే ఇంకా బాగా కొనసాగించాలని వారికి సూచించారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు అక్కడికక్కడే సచివాలయాలు ద్వారా అందిస్తున్నారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని జగన్ ప్రశంసించారు. దీంతో పాటు ఇప్పటికే సాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా మరింత మెరుగ్గా కొనసాగించాలని కోరారు.
మరోవైపు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని కార్యక్రమాల్ని చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయం కాబట్టి నిత్యం ప్రజల్లోనే ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. ఇప్పటికే దీనిపై సమీక్షల్లో క్లారిటీ ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. దీంతో మంత్రులు కూడా సరేనన్నారు. రాష్ట్రంలో విపక్షాల ట్రాప్ లో పడకుండా తమ వ్యూహంతో ముందుకెళితే చాలని జగన్ భావిస్తున్నట్లు తాజా వ్యాఖ్యల బట్టి అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications