YS Jagan: ముందుగా ఎన్నికల నోటిఫికేషన్-మీరు చేయాల్సిందిందే-కేబినెట్లో మంత్రులతో జగన్..
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. తాజాగా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరిగి గెలిచే అవకాశం లేదని తేలిపోవడంతో వారిని వైఎస్ జగన్ మార్చేస్తున్నారు. ఆయా చోట్ల కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలోనూ మంత్రులతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంతా అంచనా వేస్తున్న వేళ.. ఇవాళ కేబినెట్ భేటీలో మంత్రులకు జగన్ కీలక సంకేతం ఇచ్చారు. ఈసారి ఎన్నికలకు నోటిఫికేషన్ గతంలో కంటే 15 నుంచి 20 రోజుల ముందు వచ్చే అవకాశం ఉందని సీఎం మంత్రులకు తెలిపారు. కాబట్టి మంత్రులంతా మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎన్నికలకు అంతా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వారికి వివరించారు.
ఈసారి ఎన్నికలు కాస్త ముందుగా జరిగే అవకాశం ఉన్నందున మంత్రులు క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా పని చేయాలని సీఎం జగన్ సూచించారు. గతం కంటే 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంత్రులు తమ నియోజకవర్గాల్లోనే ఉంటూ పార్టీ గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. ఏదేమైనా ఎన్నికలకు పూర్తి సన్నద్దంగా ఉండాలని మంత్రుల్ని జగన్ ఆదేశించారు.
ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున అభ్యర్ధుల్ని మారుస్తున్న నేపథ్యంలో అక్కడక్కడా అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రుల్ని స్ధానికంగా ఉండాలని జగన్ కోరడం ఆసక్తి రేపుతోంది. అసంతృప్తుల్ని సమన్వయం చేసే బాధ్యతను మంత్రులకే జగన్ అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications