టచ్‌లో టిడిపి ఎమ్మెల్యేలు, పేర్లు చెప్తే ప్రభుత్వం ఔట్!: జగన్ సంచలనం
హైదరాబాద్: ఓటుకు నేటు కేసు నుంచి బయటపడేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు మండిపడ్డారు. ఆయన గవర్నర్ నరసింహన్‌ను సాయంత్రం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
టిడిపి నుంచి మా పార్టీలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి పేర్లు చెప్పిన గంటలోనే చంద్రబాబు
ప్రభుత్వం పడిపోతుందన్నారు.
నేను మాటలు చెప్పడం కాదని, మీరే చూస్తారని విలేకరులతో అన్నారు. చంద్రబాబుకు ఓ చెడ్డ అలవాటు ఉందని, మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయిస్తారన్నారు. బుద్ధి ఉన్న వారు ఎవరూ టిడిపిలోకి వెళ్లరని చెప్పారు. తమ పార్టీ నాయకులు చంద్రబాబును దుమ్మెత్తిపోసినా దులిపేసుకుంటారన్నారు.
ఎమ్మెల్యేలను ఎందుకు కొనడం లేదని కేబినెట్లో మంత్రులకు చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబుకు తాను సవాల్ విసురుతున్నానని, ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి రాగలరా అన్నారు. నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో ప్రజలే తీర్పు చెబుతారన్నారు. ఎన్నికలకు వెళ్లి తేల్చుకుందామన్నారు. సభాపతి పైన అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు.
ఎన్నికల సమయంలో అందరి రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదన్నారు. కాపు గర్జన, తుని ఘటన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, దానిని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
కాపు గర్జనకు సరిపడా పోలీసులను పెట్టలేదన్నారు. అలాంటప్పుడు ఆ తర్వాత తప్పుడు కేసులు సరికాదన్నారు. తప్పుడు కేసులు పెట్టడం అన్యాయమని చెప్పారు. తుని ఘటన తర్వాత చంద్రబాబు ఆరోపణల పైన తాము గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

రుణమాఫీ విషయంలో ఆయన గవర్నర్‌తోనే అబద్దాలు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా తాము చేయాల్సింది చేస్తామని, చంద్రబాబు పైన పోరాడుతామని చెప్పారు. చంద్రబాబు పైన ఢిల్లీలో కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాబు ఎన్నికల హామీని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఎవరెవరు వెళ్తున్నారని విలేకరులు ప్రశ్నించగా.. మా పార్టీ నుంచి ఎవరూ వెళ్లడం లేదని, అసలు టిడిపి నుంచే తమ పార్టీలోకి వస్తున్నారన్నారు. తమ పార్టీ నుంచి ఆ జిల్లా నుంచి, ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్తున్నారని అవాస్తవాలు ప్రచారం చేశారన్నారు.
చంద్రబాబుది మునిగిపోయే పడవ అన్నారు. చంద్రబాబుకు మీడియాలో కొద్దో గొప్పో మద్దతు ఉందని, దీంతో చంద్రబాబు చెప్పింది వారు రాస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు తిడుతున్నారన్నారు. బుద్ధి ఉన్న వాళ్లు ఎవరు కూడా టిడిపిలోకి వెళ్లరని చెప్పారు.
చంద్రబాబుకు దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి రావాలని, నేను గెలుస్తానో, చంద్రబాబు గెలుస్తారో చూద్దామన్నారు. ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో చూద్దాం రావాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కెసిఆర్ టెండర్లు పిలిచారని, దీంతో 90 టీఎంసీల నీళ్లు దారి మళ్లితే రాయలసీమకు నీళ్లు రావని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపమని తాము కెసిఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, తుని ఘటన పైన తప్పుడు కేసులు, చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు.. తదితర నాలుగు అంశాల పైన తాము గవర్నర్ నరసింహన్‌ను కలిశామని జగన్ చెప్పారు. గిరిజన అడ్వయిజరీ కమిటీని నియమించాలని, కానీ ఇప్పటి వరకు చంద్రబాబు వేయడం లేదన్నారు.












Click it and Unblock the Notifications