వైసీపీకి ప్రత్యేక యూట్యూబ్ ఛానల్- లాంచ్ చేసిన జగన్
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడదామని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులతో ఆయన మంగళవారం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై పలు అంశాలు ప్రస్తావించిన ఆయన, పార్టీ కార్యాచరణను ప్రకటించారు. మెడికల్ కాలేజీల అంశంపై కోటి సంతకాల సేకరించాలని నిర్ణయించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామంలో విస్తతంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని జగన్ చెప్పారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల జరిగే నష్టాన్ని, సూపర్ సిక్స్, సూపర్ సెవన్ పేరుతో చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. దానికి అనుబంధంగా గ్రామంలో మన పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు.
దీన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా ప్రజలకు చేరవేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన యూట్యూబ్ ఛానల్ ను ఈ సందర్భంగా జగన్ ప్రారంభించారు. వైఎస్ఆర్‌సీపీ టాక్స్ - కర్నూలు పేరిట ఈ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటైంది. దీన్ని లాంఛనంగా ప్రారంభించారు జగన్. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ప్రజలు, పార్టీ శ్రేణులకు చేరవేయడానికి యూట్యూబ్ ఛానల్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
దీన్ని కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి రూపొందించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్.వి.మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications