కృష్ణాజిల్లాలో జగన్ టూర్ మొదలు..! పోలీసుల షాకులు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటన ప్రారంభమైంది. మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధిత రైతుల్ని పరామర్శించేందుకు జగన్ ఈ టూర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఉదయం తాడేపల్లి నుంచి రోడ్డు మార్గానే జగన్ బయలుదేరి వెళ్లారు. విజయవాడ, పెనమలూరు, పామర్రు మీదుగా పెడన నియోజకవర్గానికి జగన్ వెళ్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చాయి.
కృష్ణా జిల్లాలోని మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో జగన్ టూర్ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు, స్దానిక రైతులు భారీగా తరలివచ్చారు. పెనమలూరు, ఉయ్యూరు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి హైవేపైకి చేరుకున్నారు. జగన్ కు విజయవాడ నుంచి మచిలీపట్నం హైవేపై ఎక్కడికక్కడ ఎదురేగి ఘన స్వాగతం పలికారు. దీంతో పోలీసులు వారిని నియంత్రించాల్సి వచ్చింది. అయినా జగన్ మాత్రం తన అభిమానుల్ని ఎక్కడికక్కడ పలకరిస్తూనే ముందుకు సాగుతున్నారు.

మరోవైపు పోలీసులు జగన్ టూర్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ ఆంక్షలు విధించారు. డీజేలు పెట్టకూడదని, బైక్ ర్యాలీలు తీయొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. అనుమతించిన వాటికి మించి వాహనాలను తీసుకురావొద్దని, జనాన్ని తరలించవద్దని సూచిస్తున్నారు. అలాగే అనుమతి లేకపోతే వైసీపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని జగన్ కు పోలీసులు షరతులు విధించారు. అలాగే 10 వాహనాలు, 500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బైక్‌లకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ రైతుల్ని కలిసేందుకు వెళ్తుంటే ఈ ఆంక్షలు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.

వైయస్ జగన్ ఇవాళ కృష్ణా జిల్లా టూర్ లో భాగంగా పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరు చేరుకుంటారు. మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకూ, క్షేత్రస్ధాయిలో వాస్తవ పరిస్దితుల్ని అంచనా వేయబోతున్నారు. మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమాలు ముగించుకుని తిరిగి సాయంత్రానికి అవనిగడ్డ హైవే మీదుగా జగన్ తాడేపల్లి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications