జగన్ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ఫిక్స్ ? వచ్చే వారంలో ఉండే ఛాన్స్- కొందరికి ఆల్రెడీ హింట్ ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎదురుదెబ్బలు తలుగుతున్నాయి. కీలక సమయంలో నాలుగు ఎమ్మెల్సీలు కోల్పోవడాన్ని వాపుగానే చెప్పుకుంటున్న సీఎం జగన్.. లోలోపల మాత్రం దీనిపై తీవ్ర మథనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత కేబినెట్లోని పలువురు మంత్రుల పనితీరుపై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేబినెట్ ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నిన్న ఎమ్మెల్యేలతో సుదీర్ఘ భేటీ నిర్వహించిన వైఎస్ జగన్ గడప గడపకూ ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్ వంటి కార్యక్రమాలపైనే మాట్లాడారని బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు. కేబినెట్ ప్రక్షాళన, ముందస్తు ఎన్నికలంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసిందంటూ మంత్రులు చెప్పుకున్నారు. కానీ జగన్ మాత్రం కేబినెట్ ప్రక్షాళన దిశగా ఇవ్వాల్సిన వారికి తగిన సమాచారం ఇచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కేబినెట్ లో కొందరు మంత్రులపై తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే వచ్చేవారం కేబినెట్ ప్రక్షాళనకు జగన్ ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్లో మార్పులకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి ఎవరికి ఉద్వాసన పలుకుతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అలాగే కొత్తగా ఎవరెవరికి అవకాశం దక్కుతుందనే దానిపైనా ఉత్కంఠ పెరుగుతోంది.
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న పేర్లను చూసుకుంటే ప్రస్తుత కేబినెట్లోని మంత్రులు సీదిరి అప్పలరాజు, విడదల రజని, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్ వంటి వారిపై కత్తి వేలాడుతోంది. అలాగే కొత్తగా కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్న వారిలో గ్రంధి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్నినాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, మర్రి రాజశేఖర్, తోట త్రిమూర్తులు వంటి వారు ఉన్నారు. వీరిలో పలువురికి ఈసారి కేబినెట్ ప్రక్షాళనలో చోటు దక్కవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications