ప్రతి చర్య తప్పదు, ఇక ప్రజల్లోనే ఉంటా - జగన్ కీలక ప్రకటన..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయటం లేదని ధ్వజ మెత్తారు. పోరుబాటకు సిద్దం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మద్దతుగా కేడర్ తో మమేకం అవుతూ పోరాటాలు చేయాలని సూచించారు. గోడకు కొట్టిన బంతిలా కూటమి పాలన లో నేటి చర్యలను ప్రతిచర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. జగన్ 2.0 ఖాయమని.. ఖచితంగా మార్పు ఉంటుందని స్పష్టం చేసారు.
చంద్రబాబు భయం అదే
మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన పేరుతో ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే వారు ఉండ కూడదని భయానక వాతావరణం క్రియేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని జగన్ తేల్చి చెప్పారు. సంఖ్యా బలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు కుయుక్తులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో వైసీపీ కేడర్ పైన కేసులతో బెదిరింపులుకు దిగారని.. కేడర్ తెగించి పార్టీ అభ్యర్ధులను గెలిపించిందని జగన్ పేర్కొన్నారు. వైసీపీ కేడర్ ను చంద్రబాబు ఏం చేయలేరని జగన్ చెప్పుకొచ్చారు.

ప్రతి చర్య తప్పదు
రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీకి బలం ఉందని.. అక్కడ పోలీసులే ఎంపీటీసీ వాహనం ఎక్కారని జగన్ పేర్కొన్నారు. స్థానిక ఎస్సై వారి వాహనం ఎక్కి టీడీపీకి అనుకూలంగా ఓటు వేయమని బెదిరించారని చెప్పుకొచ్చారు. ఎన్నిక సమయానికి వైసీపీ ఎంపీటీసీలు వెళ్లకుండా అడ్డుకున్నారని జగన్ వివరించారు. ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబు, ఆయన మద్దతు దారులు భయానక వాతావరణం కల్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా తిప్పి కొడతారని జగన్ హెచ్చరించారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని చూసామని గుర్తు చేసారు. ప్రభుత్వం చేస్తున్న బెదిరింపుల కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు.
అధికారం ఖాయం
రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ నాశనమయ్యాయని జగన్ ఆరోపించారు. అవినీతి తారా స్థాయికి చేరిందని చెప్పుకొచ్చారు. ప్రతీ గ్రామంలో మద్యం షాపులు.. బెల్టు షాపులు నడుపుతున్నారని మండి పడ్డారు. ఇసుక, మద్యం, మైనింగ్, పేకాట క్లబ్బుల్లో ఇష్టానుసారం నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహాజ మని చెప్పిన జగన్.. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ప్రజల్లో ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. ఇదంతా తెలిసే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ 2.0 లో ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని జగన్ ప్రకటన చేసారు.












Click it and Unblock the Notifications