తుని ఎఫెక్ట్: రోజాకు మాదిరే జగన్‌ను సస్పెండ్ చేస్తారా?
హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కూడా రోజాకు మాదిరిగా శాసనసభ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
వైయస్ జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్‌కు తగిన వ్యూహాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడే సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. తుని ఘటనల నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడిపై, స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును క్రిమినల్ నెంబర్ వన్ అని, కోడెలను హంతకుడని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ వ్యాఖ్యలు శాసనసభ వెలుపల చేసినా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇందుకు అనుగుణంగానే కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ శానససభ్యుడు లింగారెడ్డి ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రిపై, శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌ను మూడున్నరేళ్ల పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు.
అందుకు అనుగుణంగానే బడ్జెట్ సమావేశాల్లో జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి ప్రయత్నిస్తే సస్పెండ్ చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. మొత్తం మీద, వచ్చే శాసనసభ సమావేశాలు మరింత వేడిగా వాడిగా జరిగే అవకాశాలే ఉన్నాయి.












Click it and Unblock the Notifications