బిజెపితో జగన్‌ దోస్తీ: పవన్ కల్యాణ్‌కు జోష్, చంద్రబాబుకు ఊరట?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఎన్నికలకు ముందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజెపితో దోస్తీ కడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కీలకమైన మలుపులు తిరిగే అవకాశం ఉంది. బిజెపితో దోస్తీ కట్టాల్సి వస్తే ఆయన ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదులుకోవాల్సి వస్తుంది.

ప్రత్యేక హోదా డిమాండ్‌ను జగన్ వదులుకోవాల్సి వస్తే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఊపు లభించే అవకాశం ఉంది. నిజానికి, ప్రత్యేక హోదాపై రాజీ పడ్డారనే విమర్శలతోనే జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

అదే విషయంపై ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు. కేసుల నుంచి బయటపడడానికి ప్రత్యేక హోదాను కూడా వదిలేసి బిజెపితో రాజీ పడడానికి సిద్ధపడ్డారని, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీలోని జగన్ ఉద్దేశం అదేనని అంటున్నారు.

ప్రత్యేక హోదానే జగన్ నినాదం....

ప్రత్యేక హోదానే జగన్ నినాదం....

రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాజీపడ్డారని, నోటుకు ఓటు కేసు నుంచి బయటపడడానికి కేంద్రంతో రాజీ పడి ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేశారని జగన్ విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అటువంటి విమర్శనే జగన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా వస్తే జరిగే మేలుల గురించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి కూడా మాట్లాడారు. ధర్నాలు చేశారు. ఢిల్లీలో కూడా ధర్నా చేశారు. బిజెపితో దోస్తీ కట్టిప్రత్యేక హోదా డిమాండ్‌ను వదిలేస్తే జగన్ విశ్వసనీయత దెబ్బ తినే అవకాశం ఉంది.

అందుకే అలాంటి ప్రతిపాదన...

అందుకే అలాంటి ప్రతిపాదన...

వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ ప్రతిపాదించినప్పుడు అందుకు జగన్ కాదన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత కలిసి నడుద్దామని జగన్ అన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదాపై తన డిమాండ్‌ను వదులుకోలేదని అనిపించడానికి ఇది పనికి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెప్పవచ్చు. బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకులు వేర్వేరయినప్పటికీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంటే ముస్లింలు దూరమవుతారనే అనుమానాలు కూడా జగన్‌కు ఉన్నట్లు భావించవచ్చు. రాయలసీమలోని కర్నాలు, అనంతపురం వంటి జిల్లాల్లో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంది. రాయలసీమలో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకుంటేనే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి జగన్‌కు అవకాశం ఉంటుంది. అందువల్ల దాన్ని వదులుకోవడం కూడా జగన్‌కు ఇష్టం లేదని అంటున్నారు.

పవన్ కల్యాణ్ దూకుడు పెంచవచ్చు...

పవన్ కల్యాణ్ దూకుడు పెంచవచ్చు...

జగన్‌ బిజెపితో దోస్తీ కడితే ప్రత్యేక హోదా డిమాండ్ పూర్తి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎజెండా మాత్రమే అవుతుంది. ఎలాగూ వామపక్షాలతో కలిసి నడుద్దామని అనుకుంటున్నారు కాబట్టి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బిజెపిని నిలదీయడం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ఆయనకు పోటీ ఉండదు. అది పవన్ కల్యాణ్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా బహుశా జగన్ మనసులో ఉండి ఉంటుంది. హోదా అంశాన్ని పవన్ కల్యాణ్‌కు వదిలేస్తే జరిగే నష్టమేమిటో ఆయనకు తెలిసి ఉంటుంది. అందుకే, ఎన్నికల తర్వాత దోస్తీకి మాత్రమే బిజెపితో ఆయన సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.

చంద్రబాబుకు ఊరట...

చంద్రబాబుకు ఊరట...

జగన్ బిజెపితో దోస్తీ కడితే ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేస్తారు కాబట్టి చంద్రబాబుకు ఊరట కలిగే అవకాశం ఉంటుంది. తనపై జగన్ నుంచి విమర్శలు తగ్గడమే కాకుండా జగన్‌పై ఎదురుదాడి చేయడానికి అవకాశం లభిస్తుంది. నోటుకు ఓటు కేసులో తాను కేంద్రంతో రాజీ పడి ప్రత్యేక హోదాను పక్కన పెట్టినట్లు జగన్ విమర్శలు చేస్తే దాన్నే తిప్పికొట్టడానికి చంద్రబాబుకు వీలు చిక్కుతుంది. అదే సమయంలో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు కాబట్టి అది మరింతగా ఉపయోగపడవచ్చు. ప్రత్యేక హోదా డిమాండుతో పవన్ కల్యాణ్ ప్రజల్లోకి చొచ్చుకుపోతే అది బిజెపికి, వైయస్సార్ కాంగ్రెసుకు తీవ్రమైన విఘాతం కలిగించి, ఓట్లు చీలిపోవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి లాభం కలగవచ్చు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to political analysts - If YSR Congress party president YS Jagan forges alliance with BJP in Andhra Pradesh, it may help Jana sena chief Pawan Kalyan.
Please Wait while comments are loading...