ఎవరికైనా మద్దతిస్తా: జగన్, బిజెపితో కలుస్తారు: జైరాం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇచ్చి.. రాష్ట్రానికి నిధులు తెస్తామన్నారు. టిడిపి మానిఫెస్టోలోని హామీలు నేరవేర్చేందుకు చంద్రబాబు జీవితం సరిపోదన్నారు.
టిడిపి ప్రకటించిన రైతు రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం ఇవ్వటానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారాన్ని పొందాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో ఎన్నికలు పూర్తైన గంటలోనే చంద్రబాబు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్‌లు మాటమార్చారని ఆరోపించారు.

ఓట్ల కోసం, సీట్ల కోసం బంగారం లాంటి రాష్ట్రాన్ని చీల్చారని, తనపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడి గుండె చప్పుడు వినే నాయకుడినే ముఖ్యమంత్రిని చేయాలన్నారు. నాయకుడు చనిపోయినా పేదవాడి గుండెల్లో పదిలంగా ఉండేలా పనులు చేయాలన్నారు.
మనం వేసే ఓటుతో మన తలరాతలు మారనున్నాయన్నారు. విశ్వసనీయతకు అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. బెల్టుషాపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడన్నారు. ఐటి ఎగుమతులు పెంచేందుకు విశాఖలో ఐటి ఎక్స్‌పోర్టుజోన్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
నకిలీ కాంగ్రెస్: జైరాం
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నకిలీ కాంగ్రెస్ అని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. ఆయన సీమాంధ్రలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్‌కు ఓటేస్తే నేరస్థుడికి మద్దతిచ్చినట్లే అన్నారు. వైయస్ తన సొంత డబ్బుతో పథకాలను పెట్టలేదన్నారు. ఎన్నికల అనంతరం జగన్ బిజెపితో చేతులు కలుపుతారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications