జైట్లీతో జగన్ భేటీ!, మంచి జరుగుతుందని..
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చాలని జైట్లీని జగన్ కోరనున్నారు.
అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌లనుకలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు, సమస్యల పైన వారికి వినతిపత్రం సమర్పించడంతో పాటు కొత్త రాష్ట్రం అభివృద్ధికి పూర్తి సాయం అందించాలని కోరనున్నారు.

కాగా, గురువారం రాత్రి జగన్, ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో అధికార పార్టీ అరాచకాలతో ప్రజస్వామ్యం ఖూనీ అవుతోందని, అలా జరుగుతోంటే ఇక పార్టీ గుర్తులపై ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.
అధికార పార్టీ నామినేట్ చేసుకునేలా చట్టం చేస్తే చాలు కదా అని ఎద్దేవా చేశారు. దాడుల పైన పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదన్నారు. తక్షణం జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని హితవు పలికారు. ప్రణబ్, రాజ్‌నాథ్‌లకు తాము వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు.
దాడుల పైన రోజు పత్రికలలో వస్తున్నాయని, ఇందుకు సంబంధించి తమ వద్ద పేపర్ కటింగ్స్ ఉన్నాయని చెప్పారు. ఎలక్ర్టానిక్ మీడియాలోను వార్తలు వచ్చాయన్నారు. హోంమంత్రికి దాడుల విషయం చెప్పామని, ఆయన తమకు మంచి చేస్తారని భావిస్తున్నామని, అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications