అరుణ్ జైట్లీతో జగన్ భేటీ: ఏపి సమస్యల వివరణ
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలెత్తిన పలు సమస్యలను జగన్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు సమస్యలను ప్రస్తావిస్తూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. జైట్లీతో భేటీ అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము చెప్పిన సమస్యలను ఆర్థిక మంత్రి సావదానంగా విన్నారని తెలిపారు.
లోటు బడ్జెట్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సదుపాయాల కొరత ఏర్పడిందని, ఐటి కార్యకలాపాలు లేవనే విషయాలను జైట్లీకి అందజేసిన పత్రంలో వివరించామని చెప్పారు. ఏపికి మౌలిక వస్తువుల తయారీ, ఉన్నత విద్యా, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు చాలా అవసరమని అన్నారు. ఉన్నతమైన ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేయాలని కోరినట్లు తెలిపారు.

పరిశ్రమల అభివృద్ధి కోసం పన్ను రాయితీలు కల్పించాలని కోరామన్నారు. ఏపికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీని 15ఏళ్లపాటు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా రాష్ట్రానికి నిట్, ఐఐఎం, ఐఐఎస్ఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తుల నిర్వహణ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని తమ విజ్ఞాపన పత్రంలో కోరినట్లు తెలిపారు.
విశాఖలో పెట్రోలియం కాంప్లెక్స్, కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖలో మెట్రో రైలుతోపాటు విజయవాడ-తెనాలి-గుంటూరులలో మెట్రో పాలిటన్ అర్భన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications
