రాజధాని: గవర్నర్‌ను కలిసి జగన్ ఫిర్యాదు, 31న దీక్ష
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. గుంటూరు జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, రైతులు తదిరులతో కలిసి ఆయన నరసింహన్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం, పోలీసులు కలిసి రైతులను చిత్రహింసలు పెడుతున్నారని గవర్నర్‌కు చెప్పారు.
స్థానిక నేతలను, భూములు ఇవ్వబోమని చెబుతున్న రైతులను పోలీసు స్టేషన్లలో ఉంచి చిత్రహింసలు పెడుతున్నారని తెలిపారు. తమకు ఎలాంటి నేర చరిత్ర లేకపోయినా రాజధానికి భూములు ఇవ్వబోమన్న ఒక్క కారణంతో తమను హింసించడం సరికాదని గవర్నర్‌కు జగన్ చెప్పారు. రైతులను ఆదుకోవాలని కోరారు.
పంటల దహనకాండకు తామే బాధ్యులమని ఒప్పుకోవాలని స్టేషన్లకు పిలిపించి హింసిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను ఆయన గవర్నర్‌కు తెలిపారు. కలిసిన వారిలో గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ రైతు పరిరక్షణ సంఘ సభ్యులు, రైతులు ఉన్నారు.

జగన్ దీక్ష
రాజధాని ప్రాంతంలో రైతులను చిత్రహింసలు పెడుతున్న తీరు, ఇతర ప్రాంతాలలో కూడా రైతులు అనుభవిస్తున్న కష్టాల పైన జగన్ దీక్ష చేయనున్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరిగే ఈ దీక్షకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వేదిక కానుంది.
ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యల పైన గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని, ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. రైతుల కష్టాలను గవర్నర్‌కు వివరించేందుకు గుంటూరు, కృష్ణా జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు వచ్చారని చెప్పారు.












Click it and Unblock the Notifications