సీఎం జగన్ కార్యాలయం నుంచి 11 మందికి ఫోన్ వెళ్లింది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగితే తెలంగాణతోపాటే ఏపీకి కూడా జరుగుతాయంటూ వార్తలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వీటికి బలం చేకూరుస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అలాగే ఉన్నాయి. సుడిగాలిలా పర్యటనలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీలోను, ప్రభుత్వంలోను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఎలక్షన్ టీం ను సిద్ధం చేసుకుంటున్న జగన్
సీఎం తన ఎలక్షన్ టీం ను సిద్ధం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందేనని హుకుం జారీచేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వార్డు సభ్యుల వరకు ఎవరికీ మినహాయింపునివ్వలేదు. రేపు వీరంతా ప్రజలతో మమేకమై మంచిపేరు తెచ్చుకుంటేనే వైసీపీ అధికారంలోకి రాగలుగుతుందని జగన్ అంచనా. దీనివల్ల ప్రజాప్రతినిధులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తున్నారు.

ఎవరైతే అలసత్వంగా ఉన్నారో.. వారికి వెంటనే ఫోన్
ఇందులో పాల్గొనడానికి ఎవరు అలసత్వం ప్రదర్శించినా వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లిపోతోంది. ప్రజల్లో మంచి అభిప్రాయం లేకపోతే టికెట్ నిరాకరిస్తానని, అందులో మొహమాటం లేదని జగన్ స్పష్టం చేస్తున్నారు. గత సమీక్షలో 27 మంది నేతలు గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనడంలేదని జగన్ చెప్పారు. వారికి గట్టిగా హెచ్చరికలు జారీచేసి పంపించారు. మరో రెండురోజుల్లో సమీక్ష జరగబోతోంది. ఈసారి ఎంతమంది నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తారోనని నాయకులు లోలోన ఆందోళన చెందుతున్నారు.

పీకే టీం ఇచ్చే నివేదిక ఆధారంగా..
ప్రశాంత్ కిషోర్ టీమ్ వైఎస్ జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తోంది. ఆ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగానే క్లాస్ పీకుతారని తెలుస్తోంది. గతంలో 27 మంది నేతలు గడప గడపకు మన ప్రభుత్వాన్ని లైట్ తీసుకోగా.. ఈసారి ఆ సంఖ్య 11కు చేరిందని తెలుస్తోంది. ఈ 11 మందిలో పలువురు మంత్రులు కూడా ఉన్నారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల్లోకి వెళ్లే విషయంలో తనకు ఎటువంటి మొహమాటం లేదని, ఉపేక్షించే ప్రసక్తే లేదని జగన్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరో రెండురోజుల్లో జరగబోతున్న సమీక్షా సమావేశంలో సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఎంతమంది పేర్లు ప్రకటిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.