YS Jagan or Chandrababu : జగనా, చంద్రబాబా ?... ఎవరు స్మార్ట్ పొలిటీషియన్ ?
ఏపీ రాజకీయాలు 2024 ఎన్నికల దిశగా సాగుతున్నాయి. మరోసారి జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు ఖాయమని తేలిపోయింది. బీజేపీతో కలిసి సాగుతున్న పవన్ కళ్యాణ్ మహా అయితే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కాషాయ పార్టీతో కొనసాగడం లేదా వదిలేయడం చేస్తారు. కానీ ఇంతకు మించి సగటు ఓటరు ఆలోచనల్లో ఏముంది ? జగన్ కు అసలు ప్రత్యామ్నాయం చంద్రబాబేనా ? చంద్రబాబుకు ప్రత్యామ్నాయం జగనేనా ? అసలు వీరిద్దరి రాజకీయాలు ప్రస్తుతం సవ్యంగానే సాగుతున్నాయా ? గతంలో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారా ? ప్రస్తుత పరిస్ధితుల్లో స్మార్ట్ పొలిటిషియన్ ఎవరు ? ఇప్పుడీ అంశాలపై చర్చ జరుగుతోంది.

వైఎస్ జగన్ రాజకీయం
ఏపీలో ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా తన రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్, తండ్రి వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీని స్ధాపించారు. తనపై సీబీఐ కేసులు పెట్టిన కాంగ్రెస్ ను కకావికలు చేస్తూ ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారిపోయారు. దీంతో చంద్రబాబుతో పోటీగా రాజకీయాలు చేస్తూ ఇప్పుడు ఆయన భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చేశారు. 151 సీట్ల భారీ మెజారిటీతో తొలిసారి రాష్ట్రంలో అధికారంలో వచ్చిన జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఓవైపు అయితే ఇందుకోసం ఆయన ఎంచుకున్న వ్యూహం జగన్ ను ప్రత్యేకంగా మార్చేసింది.

చంద్రబాబు రాజకీయం
ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా పనిచేసిన అనుభవజ్ఞుడు చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ రాజకీయాల ధాటికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు మీద పడుతున్న వయస్సు, మరోవైపు జగన్ కు దీటుగా రాజకీయాలు చేయాల్సిన పరిస్ధితి చంద్రబాబును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సొంత నియోజకవర్గం కుప్పంను కాపాడుకుంటూనే మరోవైపు రాష్ట్రంలో తిరిగి టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు సర్వశక్తులొడ్డుతున్నారు. అయితే ఇందుకోసం ఆయన ఎంచుకుంటున్న రాజకీయ వ్యూహాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఎవరు స్మార్ట్ పొలిటీషియన్ ?
ఏపీ రాజకీయాలకు తగినట్లుగా అల్లుకుపోవడంలో గతంలో చంద్రబాబు వ్యూహాలు బాగానే పనిచేశాయి. ఇప్పుడు జగన్ అంతకు మించిన వ్యూహాలతో ఆకట్టుకుంటున్నారు. అయితే ఇద్దరికీ అనుభవం విషయంలో ఎలాంటి పోలికలు లేకపోయినా స్మార్ట్ పాలిటిక్స్ విషయంలో మాత్రం ఎంతో తేడా ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో బీజేపీకి కోపం వస్తుందని తెలిసీ విభజన హామీల్ని తెరపైకి తెచ్చి చంద్రబాబును ఇరుకునపెట్టిన జగన్ .. కేంద్రం నుంచి ఆయన్ను బయటికి తెచ్చేశారు. అయినా శాంతించకుండా ఒత్తిడి పెంచారు. దీంతో చంద్రబాబు ఏకంగా మోడీపై వ్యక్తిగత దాడుల వరకూ వెళ్లి నష్టపోయారు. దీంతో అధికారంలోకి వచ్చిన జగన్.. తిరిగి అదే బీజేపీతో సత్సంబంధాలు నెరుపుతూ దగ్గరైపోయారు. కానీ బీజేపీపై పోరు మానేసి పొత్తు కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు
అవే విభజన హామీలపై పోరాడకుండా బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అదీ సాధ్యం కావడం లేదు.
దీంతో జగన్ స్మార్ట్ రాజకీయాలు చంద్రబాబుపై ఆయన పైచేయి సాధించేందుకు పనికొస్తున్నాయి.












Click it and Unblock the Notifications