దిగ్భ్రాంతికరం, ప్రభుత్వాలు ఆదుకోవాలి: అపార నష్టంపై పవన్, జగన్ కలత
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం ఇటీవల కురిసిన భారీ వర్షాలు సృష్టించిన అపార ప్రాణ, పంట నష్టంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రకృతి బీభత్సానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 17మంది, ఉత్తర భారతదేశంలో 109మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని అన్నారు.
సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ప్రకృతి ప్రకోపం నుంచి మనం వారిని రక్షించుకోకపోవడం దురదృష్టకరమని చెప్పారు.

చిన్న విషయం కాదు
అకాల వర్షాలు సంభవిస్తాయని, ఉరుములు మెరుపులు భీకరంగా గర్జిస్తాయని తెలిసినప్పటికీ పౌర పాలనా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో 10మంది, ఆంధ్రప్రదేశ్‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయం కాదని పవన్ అన్నారు. ప్రకృతి వైపరరిత్యాల సమయంలో ప్రభుత్వాలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలన్న విషయాన్ని ఈ దుర్ఘటన మరోసారి గుర్తు చేస్తోందని అన్నారు.
అన్నదాతలను ఆదుకోవాలి
అదే విధంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు యార్డులకు చేరిస్తే అక్కడ సరైన వసతులు లేక ధాన్యం, మొక్కజొన్న వంటి వేలాది టన్నుల పంట వర్షానికి తడిసిపోవడం దురదృష్టకరమని పవన్ వ్యాఖ్యానించారు. వర్ష బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ఆర్థిక సాయాన్ని అందించాలన్నారు. బాధిత రైతులకు వారు నష్టపోయినంత మేర పరిహారం చెల్లించాలని కోరారు. ఆ ఆపత్కాల సమయంలో జన సైనికులు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణాలు కల్పోయిన వారి ఆత్మహత్యకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబాలకుతన తరపున, జనసేన పార్టీ తరపున ప్రాగఢ సానుభూతి తెలిపారు పవన్ కళ్యాణ్.
తీవ్రంగా నష్టపోయారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టంపై స్పందించారు. అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీ రైతులను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక నిధులను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
దిగ్భ్రాంతికరం
ప్రకృతి ప్రకోపానికి ప్రజలు మృత్యువాత పడటంపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జగన్. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, వారికి తక్షణే ఆర్థిక సాయం అందించాలని కోరారు. వర్షాలతో తీవ్రమైన కష్టాల్లో ఉన్న రైతన్నలకు అండగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications