AP Election: చంద్రబాబును ముంచిన ఆ పాత సవాల్ మళ్లీ విసురుతున్న జగన్...!
ఏపీలో వైసీపీని ఎట్టి పరిస్ధితుల్లోనూ మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీఎం వైఎస్ జగన్.. ఈ క్రమంలో తన రాజకీయ ప్రత్యర్ది అయిన చంద్రబాబు ముందు మరోసారి పాత సవాల్ విసురుతున్నారు. గతంలో చంద్రబాబును రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీసిన ఆ సవాల్ ను జగన్ మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ బయటికి తీశారు. అయితే ఈ సవాల్ ను స్వీకరించి చంద్రబాబు ఇబ్బందుల్లో పడతారా లేదా అన్నది ఎన్నికలు తేల్చబోతున్నాయి.
గతంలో 2014లో ఏపీ ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరారు. అయితే రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా సహా విభజన హామీలేవీ అమలు కాకపోవడంతో జగన్ ఆయనపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. ఊరూరా తిరుగుతూ రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చని ఎన్డీయేతో చంద్రబాబు ఎలా అంటకాగుతారని ప్రశ్నించారు. హామీలు అలు చేయించలేకపోతే ఎన్డీయే నుంచి తప్పుకోవాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. దీంతో జనంలోనూ ఆలోచన మొదలైంది.

జగన్ విసిరిన ఈ ఛాలెంజ్ చంద్రబాబును ఎన్డీయేకు గుడ్ బై చెప్పి బీజేపీతో ధర్మపోరాటం చేసే వరకూ తెచ్చింది. చివరికి ఎన్డీయే, బీజేపీపై పోరాటం పేరుతో జాతీయ స్దాయిలో పార్టీల్ని కూడగట్టినా చంద్రబాబుకు పరాభవమే మిగిలింది. ఏపీలో కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితమైంది. దీంతో జగన్ అనుకున్నది నెరవేర్చుకోగలిగారు. ఇప్పుడు మరోసారి ఎన్నికలకు ముందే జగన్ చంద్రబాబుకు ఎన్డీయే ఎగ్జిట్ ఛాలెంజ్ విసురుతున్నారు.
ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారిన ముస్లిం రిజర్వేషన్లపై ఎన్డీయేతో జత కట్టిన చంద్రబాబును నిలదీస్తున్న జగన్.. రిజర్వేషన్లను కాపడతారా లేక ఎన్డీయే నుంచి బయటికి వస్తారా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ముస్లింలను మోసం చేస్తారా, లేక రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఎన్డీయే నుంచి బయటికి వస్తారా అంటూ సవాల్ విసురుతున్నారు. దీనికి చంద్రబాబు వద్ద సమాధానం లేకుండా పోతోంది. అయితే దీనిపై ఇప్పుడు స్పందించడం కంటే మౌనంగా ఉంటేనే మేలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి గతానుభవాలే కారణం.












Click it and Unblock the Notifications