ఏపీలో 9 కీలక పరిశ్రమలు- ఎస్ఐపీబీ ఆమోదం-భారీగా ఉద్యోగాల కల్పన!
ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఏపీఎస్ఐబీ రాష్ట్రంలో పలు భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. ఇందులో సీఎం జగన్ కీలక సూచనలు చేశారు.
తాడేపల్లి : ఏపీలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఇందులో పలు విద్యుత్ ప్లాంట్లతో పాటు ఐటీ, డేటా ఆధారిత పరిశ్రమలున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. పరిశ్రమలు పెట్టేవారికి చేదోడుగా నిలవాలని అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీఎస్ఐపీబీ కీలక నిర్ణయాలు
ఏపీలో పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఎస్ఐపీబీ ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైంది. రాష్ట్రంలో తాజాగా పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన ప్రతిపాదనల్ని ఈ భేటీలో పరిశీలించారు. వీటిలో పలు కీలక పరిశ్రమలకు ఆమోద ముద్ర వేశారు. ఈ పరిశ్రమల రాకతో రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వానికి భారీ స్ధాయిలో రాబడి కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
దీంతో ఈ పరిశ్రమల విషయంలో తగిన సహకారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభం కావాలన్నారు. రానున్న ప్రతి పరిశ్రమలో కూడా ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం 75శాతం ఉద్యోగాలు స్థానికులకే రావాలని మరోసారి సీఎం జగన్ స్పష్టంచేశారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కీలక పరిశ్రమలకు ఆమోదం
ఇవాళ జరిగిన ఎస్ఐపీబీ భేటీలో పలు పరిశ్రమలకు ఆమోదం తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవల్లి పార్కులో ఇథనాల్ఇంధన తయారీకి ముందుకు వచ్చిన అవిశా ఫుడ్స్, ఫ్యూయెల్స్ కంపెనీ ప్రతిపాదన ఆమోదించారు. ఇది రూ.498.84 కోట్ల పెట్టుబడితో 3,300 మందికి ఉపాధి కల్పించనుంది.
అలాగే కడియం వద్ద ఆంధ్రా పేపర్ మిల్స్ విస్తరణ ప్రాజెక్టు ద్వారా రూ.3,400 కోట్ల పెట్టుబడుల రాకతో పాటు 2,100 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ ఆధ్వర్యంలో దాదాపు లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో న్యూ ఎనర్జీ పార్కు రానుంది. దీంతో రెండు దశల్లో 60 వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి. అలాగే శ్రీకాళహస్తి, పుంగనూరుల్లో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ ఫ్యాక్టరీలు ఏర్పాటును ఆమోదించారు.
దీంతో శ్రీకాళహస్తిలో రూ.915.43 కోట్ల పెట్టుబడి, పుంగనూరులో రూ.171.96కోట్లు పెట్టుబడి, ప్రత్యక్షంగా 2,350 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే రామాయపట్నంలో అకార్డ్ గ్రూప్ ఫ్యాక్టరీతో రూ. 10వేల కోట్ల పెట్టుబడి 2500 మందికి ఉద్యోగాలు వస్తాయి.

ఇతర ప్రాజెక్టులివే
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలను నిషేదించిన నేపధ్యంలో తమ కంపెనీ ప్రణాళికలను మార్చుకున్నట్లు జేఎస్‌డబ్యూ అల్యూమినియం లిమిటెడ్ ప్రకటించింది. ఫ్యాక్టరీ కోసం ప్రెవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన 985 ఎకరాల భూమిలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదించగా.. ఎస్‌ఐపీబీ ఆమోదించింది.
అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వెయ్యేసి మెగావాట్ల సామర్ధ్యంతో విండ్, సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల్నిఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోంది. నాలుగు విడతల్లో రూ.10,500 కోట్ లపెట్టుబడితో 2 వేల ఉద్యోగాలు కల్పించనుంది. విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్ ను వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తోంది.
రూ.7210 కోట్లతో దాదాపు 20 వేల ఉద్యోగాలు కల్పించనుంది. అలాగే రూ.1489.23కోట్ల పెట్టుబడితో తిరుపతిలో వింగ్‌టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్ పరిశ్రమతో 15 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి.అలాగే భోగాపురంలో 90 ఎకరాల స్థలంలో ఐటీ పార్కు ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications