ఇది నిజం కాదా, చంద్రబాబు చెప్పగలరా - జగన్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఇసుక పాలసీ పైన రాజకీయంగా రచ్చ కొనసాగుతోంది. ఉచిత ఇసుక అమలులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొత్త ఇసుక రీచ్ ల పైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఉచిత ఇసుక అమలు పైన మాజీ ముఖ్యమంత్రి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.
ఉచిత ఇసుక ఎక్కడ
ఉచిత ఇసుక విధానం అమలు పైన జగన్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేసారు. అందులో సీఎం చంద్రబాబును టార్గెట్ చేసారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత ఇసుక లభిస్తోందా అని నిలదీసారు, లభిస్తే ఎక్కడో చెప్పాలని కోరారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదని చెప్పుకొచ్చారు. అసలు ఇసుక కొందామంటేనే తమ హయాం కంటే ప్రస్తుతం రేటు రెండింతలు ఉందని వివరించారు.

నిజం కాదని చెప్పగలరా
ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా అంటూ పేర్కొన్నారు. అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా అంటూ జగన్ ప్రశ్నించారు. భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? అని నిలీసారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అంటూ రాసుకొచ్చారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయిందో చెప్పాలని డిమాండ్ చేసారు.
1.పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో @ncbn గారి మోడస్ ఆపరండీకూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 13, 2024
ఆ డబ్బు ఏమైంది
ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీలనేతలు దోచేయలేదా అంటూ ప్రశ్నలు సంధించారు. కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజంకాదా అని జగన్ నిలదీసారు. 2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా అని అడిగారు.
ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు మోడస్ ఆపరండీ కూడా అలాగే ఉందిని వ్యాఖ్యానించారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదన్నారు. వైసీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి.. మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబు జగన్ వరుస ప్రశ్నలు సంధించారు.












Click it and Unblock the Notifications