ఇప్పుడు చెప్పుకొంటే ఏం లాభం..!!
YS Jagan: కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశినాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
త్వరలో తన సొంత నిధులతో..
ఈ కూల్చివేతల పట్ల మంత్రి నారా లోకేష్ స్పందించినప్పటికీ- రాజకీయ రచ్చకు బ్రేకులు పడట్లేదు. ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున క్షమాపణ సైతం చెప్పారాయన. అధికారులపై చర్యలు తీసుకుంటామని, త్వరలో తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తానని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.

వైసీపీ నేతల వరుస సందర్శన..
కూల్చివేతల తరువాత కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే, కడప జిల్లా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ఆదిత్యరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల జ్యోతి క్షేత్రాన్ని సందర్శించారు.
ఎండగట్టిన జగన్..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలపై జరుగుతున్న దాడులు, అసత్య ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండగట్టారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారం, ఫొటోలను పోస్ట్ చేశారు.
ఆలయాలపై దాడులు చేసేదీ వీళ్లే..
ఆలయాలపై దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అంటూ నిలదీశారు. తిరుపతి లడ్డూ, కాశినాయన ఆశ్రమం కూల్చివేత.. సహా అనేక అంశాలను ఆయన ఇందులో ప్రస్తావించారు.
తిరుపతిలో తొక్కిసలాట ఎవరి వైఫల్యం ..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న ఆలయాలపై దాడులు, తిరుపతిలో తొక్కిసలాట వంటి అంశాలను గుర్తు చేశారు. అవన్నీ ఎవరి వైఫల్యాల వల్ల సంభవించాయని ప్రశ్నించారు.

ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది..
దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి?, ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది?, ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు?.. అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు వైఎస్ జగన్. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? అంటూ నిలదీశారు.
కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలను నిలిపివేయాలని..
అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలను నిలిపివేయాలని, వాటిని తొలగించాలంటూ 2023 ఆగస్టు 7వ తేదీన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, అయినప్పటికీ- అప్పటి తన ప్రభుత్వం వాటిని అమలు చేయలేదని జగన్ పేర్కొన్నారు.
వాస్తవమా? కాదా..
ఆ క్షేత్ర పరిరక్షణకు తమ ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవమా? కాదా అని ప్రశ్నించారు. 2023 ఆగస్టు 18వ తేదీన అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా లేఖ రాశానని పేర్కొన్నారు. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీశాఖ నుంచి మినహాయించాలని కోరానని అన్నారు.
ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని..
ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తప్పకుండా పాటిస్తామనంటూ ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పామని అన్నారు. తమ ప్రయత్నాలతో కేంద్ర ప్రభుత్వం తన చర్యలను నిలుపుదల చేసిందని చెప్పారు. తమ అయిదు సంవత్సరాల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఏ ఒక్క చర్య కూడా తీసుకోలేదని అన్నారు.
ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల..
ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని జగన్ చెప్పారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోందని పేర్కొన్నారు. కూల్చివేతల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు..
ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి అతి కిరాతకంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. కలెక్టర్ ఆదేశాలతో.. ఆర్డీఓ పర్యవేక్షణలో కాశినాయన క్షేత్రంలో కూల్చి వేత కొనసాగించారని విమర్శించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారని జగన్ ధ్వజమెత్తారు.
తామే ఉత్తర్వులు ఇచ్చి..
తామే ఉత్తర్వులు ఇచ్చి, తమ చేతులతోనే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టి, ఆశ్రయం కల్పించే కాశినాయన పుణ్య క్షేత్రాన్ని కూల్చివేశారని అన్నారు. వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. వీళ్ల తీరే అంత..అంటూ మండిపడ్డారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే..
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతేనని విమర్శించారు.
ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు..
ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లేనని జగన్ అన్నారు. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారని చంద్రబాబు- పవన్ కల్యాణ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు.
సనాతన వాదిగా చెప్పుకొంటూ..
సనాతన వాదిగా చెప్పుకొంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీశాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటివరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని జగన్ గుర్తు చేశారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అంటూ నిలదీశారు.












Click it and Unblock the Notifications