ఇదే ఊపులో జగన్ మరో టూర్..: రూట్ మ్యాప్, వివరాలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. గుంటూరు తర్వాత ఇక ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు.
ఈ నెల 6వ తేదీ శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నంలో.. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ పర్యటన వివరాలను ఆయన పీఏ కే నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు అవసరమైన ఏర్పాట్లపై సమాచారం అందించారు. షెడ్యూల్ ప్రకారం- జగన్ ఉదయం 10:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.

వారధి, బస్ స్టాండ్, కనకదుర్గ ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటూరుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గల జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. వారికి ధైర్యం చెబుతారు. ఇటీవలే తెలుగుదేశం- జనసేన నాయకులు, కార్యకర్తలు విసిరిన పెట్రోల్ బాంబ్ దాడిలో ఆయన ఇళ్లు ధ్వంసమైంది. పలు వస్తువులు కాలిపోయిన విషయం తెలిసిందే.
అనంతరం మధ్యాహ్నం 12:00 గంటలకు ఇబ్రహీంపట్నం నుండి జగన్ తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. తుమ్మలపాలెం, గుంటూరుపల్లి, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, బస్ స్టాండ్, వారధి మీదుగా 12:30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. జగన్ జెడ్ ప్లస్ భద్రతా కేటగిరీ రక్షణలో ఉన్నారు.












Click it and Unblock the Notifications