చంద్రబాబు, పవన్ పై జగన్ పెట్టిన కేసులెన్నో తెలుసా ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతలు, ప్రస్తుత సీఎం, డిప్యూటీ సీఎం అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఎన్ని కేసులు పెట్టించిందో ఇవాళ వెల్లడైంది. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దౌర్జన్యాలు, కేసుల నమోదు, బెదిరింపుల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై, పవన్ కళ్యాణ్ పై పెట్టిన కేసుల్నీ బయటపెట్టారు.
బాబ్లీ కేసు తప్ప తనపై గతంలో ఎప్పుడూ కేసులు లేవని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 17 కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు. తనతో పాటు పవన్ కల్యాణ్‌పై ఏడు కేసులు పెట్టారని తెలిపారు. ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు జగన్ అప్పట్లో ప్రయత్నించారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై అత్యధికంగా 60కి పైగా కేసులు పెట్టారని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంటిని కూల్చివేసే పరిస్థితి తీసుకురావడంతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు.

పులివెందులలో పోటీ చేసిన రవీంద్రనాథ్‌పై కేసుపెట్టి జైలులో పెట్టారని, సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ధూళిపాళ్ల నరేంద్రను జైలులో ఉంచారని, ప్రభుత్వాధికారులపై దాడి చేశారని కూన రవికుమార్‌పై, మహిళా నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని వివరించారు. ఫర్నీచర్ దుర్వినియోగం చేశారని కోడెల శివప్రసాదరావుపై 18 కేసులు పెట్టారని, ఆ అవమానంతో కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సీఎం జగన్ ఇంట్లో ఇప్పుడు కూడా ప్రభుత్వ ఫర్నీచర్ ఉంది అని గుర్తు చేశారు. వంగలపూడి అనిత, అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార యత్నం కేసులు పెట్టారని, అచ్చెన్న ఆరోగ్యం సరిగా లేకపోయినా 600 కి.మీ వాహనంలో తిప్పారని ఆరోపించారు.
సంబంధం లేకపోయినా ప్రశ్నాపత్రం లీకైందని నారాయణపై కేసుపెట్టడంతో పాటు రఘురామను లాకప్‌లో చిత్రహింసలు పెట్టి వీడియో చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని వాపోయారు. ఐదేళ్లు సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామ వెళ్లకుండా చేశారన్న సీఎం.. రఘురామకు సొంత నియోజకవర్గంలో కూడా భద్రత లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications