అరకోటి రైతాంగానికి భరోసా సాయం: రూ.2,190 కోట్లు: ఒక్క క్లిక్‌తో జమ: మూడు పథకాలకు నిధులు
అమరావతి: రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన మూడు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఈ నిధులను విడుదల చేశారు. ఆ నిధులను రైతుల బ్యాంకు అకౌంట్లలోకి జమ చేశారు. వాటి విలువ 2,190 కోట్ల రూపాయలు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్ర సేవా పథకాల కింద లబ్దిదారులుగా గుర్తించిన రైతులకు 2,190 కోట్ల రూపాయలను వైఎస్ జగన్ విడుదల చేశారు.

మూడు పథకాలివే..
ఈ మూడు పథకాల కింద రైతుల సంక్షేమానికి నిధులను విడుదల చేయడం వరుసగా ఇది మూడో ఏడాది. రెండో విడతగా జగన్ సర్కార్.. ఈ నిధులను విడుదల చేసింది. రైతు భరోసా కింద 50.37 లక్షల రైతులకు 2,052 కోట్లును విడుదల చేసింది. ఈ మొత్తంతో ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు 18,777 కోట్ల రూపాయలకు చేరుకుంది. సున్నా వడ్డీ పంట రుణాల కింద 6.67 లక్షలమంది అన్నదాతల కోసం 112.7 కోట్ల రూపాయల రాయితీని మంజూరు చేసింది. ఇక యంత్ర సేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు రూ.25.55 కోట్ల రూపాయలను జమ చేసింది.

ఆర్బీకేలతో
ఈ సందర్భంగా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముచ్చటించారు. రైతులకు పెట్టుబడి భరోసా ఇస్తూప్రతి సంవత్సరం 13,500 రూపాయలను వైఎస్సార్ రైతు భరోసాగా అందిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతుకు తోడు ఉండేలా రైతు భరోసా కేంద్రాలను గ్రామాల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు.

రైతాంగ అనుకూల ప్రభుత్వంగా..
తాము అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల కాలంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా ద్వారా అక్షరాలా 31.07 లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా 3,788 కోట్ల రూపాయలను అందించామని ఆయన వివరించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా 67.50 లక్షల మంది రైతులకు మరో 1,261 కోట్ల రూపాయలను అదనంగా మంజూరు చేసినట్లు చెప్పారు. 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వ బకాయిలనూ
ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోని తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయాల్సిన 960 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ, 9,000 కోట్ల రూపాయల విద్యుత్, 384 కోట్ల రూపాయల విత్తన బకాయిల భారాన్ని కూడా తామే చెల్లించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ సృష్టించిన ఇబ్బందులు, కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే- చెప్పిన సమయానికే రైతు భరోసా నిధులు, సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద నిధులను విడుదల చేశామని చెప్పారు.

ఏటేటా భారీగా పెరుగుతోన్న లబ్దిదారుల సంఖ్య..
రైతు భరోసా కింద ప్రభుత్వం గుర్తించిన లబ్దిదారుల సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా పెరుగుతోంది. 2019 అక్టోబర్‌లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375. ఆ మరుసటి ఏడాది మేలో ఖరీఫ్ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఈ సంవత్సరం రబీ సీజన్‌కు వచ్చేసరికి రైతు భరోసా కింద ప్రభుత్వం గుర్తించిన లబ్దిదారుల సంఖ్య 50 లక్షల ను దాటింది. 50.37 లక్షలుగా నమోదైంది. వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండటం వల్ల లబ్దిదారుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications