తనపై కోర్టు ధిక్కరణ కేసుల వెనుక ఎవరున్నారో చెప్పిన హైడ్రా ఏవీ రంగనాథ్
తెలంగాణా హైకోర్టు హైడ్రా కమీషనర్ గా పని చేస్తున్న రంగనాథ్ ను హైడ్రా బాధ్యతల నుండి తొలగించాలని సంచలన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో అర్హులైన అధికారిని నియమించాలని తెలంగాణ సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై రంగనాథ్ స్పందించారు. తాము రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని వెల్లడించారు.
1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడిన హైడ్రా
తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఏ.వి రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు సుమారు 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి, వేల ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్టు రంగనాథ్ వెల్లడించారు.

కోర్టు ధిక్కరణ కేసుల వెనుక భూ కబ్జాదారులు ఉన్నారన్న రంగనాథ్
లోతుకుంటలో జరిగిన భూ కబ్జాను అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆరు చెరువులను పునరుద్ధరించామని ఆయన అన్నారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతుందని రంగనాథ్ తెలిపారు. తనపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల వెనుక భూ కబ్జాదారులు ఉన్నారని రంగనాథ్ స్పష్టం చేశారు.న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్న రంగనాథ్ అన్ని కేసులను చట్ట పరంగా ఎదుర్కొంటానని తెలిపారు.
తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు
ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 48A స్ఫూర్తితో పనిచేస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. నిజాయితీతో, నిర్భయంతో విధులు నిర్వహించడమే హైడ్రా విధానమని,అదే హైడ్రా బలమని రంగనాథ్ అన్నారు. ఇప్పటివరకు తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని అన్నారు.అవన్నీ ల్యాండ్ మాఫియా తనను అడ్డుకోవటం కోసం తనపై తప్పుడు సమాచారంతో కోర్టును ఆశ్రయించిందని అన్నారు.
ఏ బాధ్యత అప్పగించిన 100% ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పని చేస్తా
రాష్ట్ర ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించిన 100% ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పని చేస్తానని రంగనాథ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనిపైన న్యాయ సలహా తీసుకుంటుంది. తీర్పును పూర్తి అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యల పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరమనుకుంటే సింగిల్ బెంచ్ తీర్పు పైన డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసే అవకాశాలపై కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.












Click it and Unblock the Notifications