Post Office: సరికొత్త రూల్స్. స్పీడ్ పోస్ట్‌లో సంచలన మార్పులు
ఒకప్పుడు పోస్టాఫీసు అనగానే పొడవాటి క్యూ లైన్లు, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు గుర్తొచ్చేవి. చివరికి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలన్నా, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పంపాలన్నా రోజంతా కేటాయించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. డిజిటల్ విప్లవంలో భాగస్వామ్యమవుతూ తపాలా శాఖ తన సేవలన్నింటినీ వేగవంతం చేసి వినియోగదారుల దరిచేరుస్తోంది. ఇంటి నుంచే ప్రీమియం చెల్లింపులతో పాటు, డెలివరీ సర్వీసుల్లో కొత్త మార్పులు తీసుకొస్తూ సరికొత్త రూపు సంతరించుకుంది.
ఇంటి నుంచే పోస్టల్ ఇన్సూరెన్స్ చెల్లింపులు...
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) పాలసీదారులు ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపుల కోసం పోస్టల్ శాఖ ప్రత్యేకం పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు, యూపీఐ ఐడీ లేదా క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా ప్రీమియం చెల్లించవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) యాప్‌ను లింక్ చేసుకుని క్షణాల్లో ఖాతాలోకి డబ్బులు జమ చేసే వెసులుబాటు తెచ్చారు. గడువు తేదీ నాటికి వాటంతట అవే కట్ అయ్యేలా ఆటో డెబిట్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.

ఆన్‌లైన్ పోర్టల్‌లో క్షణాల్లో నమోదు...
వినియోగదారులు తపాలా శాఖ అధికారిక పోర్టల్ (pli.indiapost.gov.in) ద్వారా తమ పాలసీ నంబర్, ఫోన్ నంబర్, వ్యక్తిగత వివరాలతో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. పాలసీలను లింక్ చేసుకున్న తర్వాత నేరుగా చెల్లింపులు పూర్తి చేసి ఈ-రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం డబ్బులు కట్టడమే కాకుండా, పాలసీ బోనస్ వివరాలు, లోన్ సౌకర్యాలు వంటి అనేక సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారానే 24/7 తెలుసుకునే అవకాశం లభించింది.
ఉత్తరాలు, పార్సిళ్ల మధ్య గందరగోళానికి చెక్!
మరోవైపు పార్సిళ్లు, ఉత్తరాలపై ఉత్పన్నమవుతున్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. బ్యాంకింగ్ కిట్‌లు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు పాస్‌పోర్టులు, ఓటర్ కార్డ్స్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, అర్హత కలిగిన ఐడీ పత్రాలన్నింటినీ 'లెటర్' కేటగిరీ కిందకే పరిగణిస్తారు. అలాగే 500 గ్రాముల లోపు ఉన్న రాఖీలు, గ్రీటింగ్ కార్డులు కూడా ఈ జాబితాలోనే ఉంటాయి. అమ్మకపు వ్యాపార వస్తువులు మినహా మిగిలిన అన్ని రకాల భారీ పార్సిళ్లను మాత్రమే 'పార్సిల్' కేటగిరీగా వర్గీకరిస్తారు.
24, 48 గంటల్లో డెలివరీ.. సరికొత్త స్పీడ్ పోస్ట్ రేట్లు!
వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీస్ అందించేందుకు 24 గంటలు, 48 గంటల్లో డెలివరీ చేసే విధంగా "24 స్పీడ్ పోస్ట్", "48 స్పీడ్ పోస్ట్" సేవలను రీ-డిజైన్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ఈ వేగవంతమైన సేవలు లభిస్తున్నాయి. బరువు, ప్రయాణించే దూరాన్ని బట్టి సవరించిన ధరలను అమలు చేస్తున్నారు. 50 గ్రాముల లోపు ఉండే లోకల్ స్పీడ్ పోస్ట్‌కు రుసుము రూ.38 కాగా, దేశవ్యాప్తంగా పంపేందుకు రూ.94 గా నిర్ణయించారు. బల్క్ బుకింగ్స్ చేసుకునే వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశారు.
మొత్తంగా తపాలా శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ సాధారణ పౌరులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను చేరువ చేస్తోంది.














Click it and Unblock the Notifications