మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కీలక ఎన్నికల హామీ నెరవేర్చే దిశగా ఓ అడుగు ముందుకేశారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న 'తాయి మామన్ తంగ మోతీర తిట్టం (మేనమామ బంగారు ఉంగరం) పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువులకు బంగారం ఉంగరాలను స్వయంగా తొడిగారాయన. ఈ కార్యక్రమంలో మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బరువు గల 22 క్యారెట్ల నాణ్యమైన బంగారు ఉంగరాన్ని ఈ పథకం కింద అందజేస్తుంది ప్రభుత్వం. దీనికోసం రూ. 755.83 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, మహిళల ఆరోగ్య రక్షణను మెరుగుపరచడం సహా మాతృత్వాన్ని మరింతగా గౌరవించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మొదటిదశలో 1.28 లక్షల బంగారు ఉంగరాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

ఉంగరాల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా చూడటానికి వీటికి ప్రత్యేక సీరియల్ నంబర్‌తో పాటు ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్‌ను సిద్ధం చేశారు. తమిళ సంప్రదాయంలో నవజాత శిశువులకు మేనమామ బంగారు ఉంగరం బహుమతిగా ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఆ సెంటిమెంట్‌ను ప్రతిబింబించేలా ఈ పథకానికి నామకరణం చేశారు. సొంత మేనమామలా విజయ్.. నవజాతా శిశువులకు బంగారు ఉంగరాలను తొడిగారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఇదివరకే నిబంధనలను రూపొందించింది. దరఖాస్తుదారులు తమిళనాడు నివాసులై ఉండాలి. గర్భధారణ, శిశు సంరక్షణ పర్యవేక్షణ వ్యవస్థ కింద తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆర్‌సీహెచ్ ఐడీ (RCH ID) కలిగి ఉండటం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఏ ఆసుపత్రిలో అయినా కాన్పు చేయించుకునే ప్రతి మహిళకూ ఈ బంగారపు ఉంగరం అందుతుంది.
జూన్ 22 నుంచి పుట్టిన శిశువుల పెండింగ్ రిజిస్ట్రేషన్లు, బంగారం ఉంగరం పంపిణీని పూర్తి చేయడానికి ప్రభుత్వం 107 కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రతిరోజూ దాదాపు 100 మంది శిశువులకు ఉంగరాలను అందించనున్నారు. ఇకపై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందే అర్హులైన ప్రతి పసిబిడ్డకూ ఈ ఉంగరాన్ని అందిస్తారు. అసెంబ్లీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెంగల్పట్టు, తిరుపూర్ జిల్లాలను తాత్కాలికంగా మినహాయించారు.
అనంతరం గాంధీ మెమోరియల్ మ్యూజియాన్ని విజయ్ ప్రారంభించారు. బాపూజీ విగ్రహానికి నివాళి అర్పించారు. మహాత్ముడి అసమాన జీవిత విశేషాలు, వారసత్వాన్ని ప్రతిబింబించే పలు ప్రదర్శనలను తిలకించారు. గాంధీజీ జీవిత ప్రయాణంలో కీలక ఘట్టాలను వివరించే అరుదైన ఛాయాచిత్రాలు, స్వదస్తూరితో రాసిన లేఖలు, ఆయన ఉపయోగించిన వస్తువులను విజయ్ ఆసక్తిగా తిలకించారు. మధురైతో మహాత్మా గాంధీకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.













Click it and Unblock the Notifications
