'నా శరీరం.. నా ఇష్టం': రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్!
సమాజంలో మహిళలకు వయస్సు పైబడటం అనేది ఏదో ఓ అపరాధంలాగా లేదా నిశ్శబ్ధంగా అంగీకరించాల్సిన పరిమితిలాగా ప్రచారం జరుగుతుంటుంది. కానీ ప్రముఖ నటి రాధికా ఆప్టే ఈ ఆలోచనా విధానాన్ని సరికొత్త కోణంలో ప్రశ్నిస్తున్నారు. 41 ఏళ్ల వయస్సులో ఉన్న రాధిక.. తన 20 లేదా 30 ఏళ్ల వయస్సు కంటే ఇప్పుడు తన శరీరం, కోరికల గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందంటున్నారు. 'లస్ట్ స్టోరీస్ 3' ప్రాజెక్టుతో ఆమె చేస్తున్న కామెంట్లు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ప్రాజెత్టులో ఆమె 40 ఏళ్ల మహిళగా నటిస్తూ మహిళా లైంగికతను కేంద్ర బిందువుగా నిలిపారు.
రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ కేవలం శారీరక సౌందర్యం లేదా వయస్సు పెరగడం అనే అంశానికే పరిమితం కాకుండా లోతైన చర్చకు దారితీస్తున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ మహిళలు తమ లైంగికతను, ఉత్సాహాన్ని లేదా వ్యక్తీకరణను తగ్గించుకోవాలనే సాధారణ భావనను ఆమె నిలదీస్తున్నారు. వయస్సు పెరగడం వల్ల అనుభవం, ధైర్యం, తన పట్ల తనకు స్పష్టత పెరుగుతాయని, ఇది మహిళలను మరింత శక్తివంతులుగా చేస్తుంది తప్ప బలహీనులను కాదని రాధికా ఆప్టే స్పష్టం చేశారు. ఈ విషయంలో సమాజంలో ఉన్న ద్విముఖ ప్రమాణాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. పురుష నటులు వయస్సు పెరిగినా రొమాంటింగ్ లీడ్ పాత్రలో కొనసాగుతుంటే.. నటీమణులు మాత్రం ఓ వయస్సు దాటిన తర్వాత అలాంటి కథల నుంచి వైదొలగాలని ఆశిస్తుంటారు. రొమాన్స్, కోరికలు, ఆకాంక్షలు కేవలం యువతులకే సొంతం అనే తప్పుడు సంస్కృతిని రాధికా ఆప్టే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ తరహా ఆలోచనా ధోరణిని సవాలు చేస్తూనే, వయస్సు పెరగడం అనే ప్రక్రియతో పోరాడాల్సిన లేదా దాన్ని దాచాల్సిన అవసరం లేదని రాధిక స్పష్టం చేస్తున్నారు. రాధిక ఆప్టే దృష్టిలో వయస్సు పెరగడం అంటే శారీరకంగా మారడమే కాకుండా, తనను తాను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడమేనన్నారు. ముడతలు లేదా తెల్లవెంట్రుకలను చూసి భయపడటం కన్నా, కాలంతో పాటు వచ్చే పరిపక్వతను ఆస్వాదించడమే నిజమైన జీవితమని ఆమె సందేశమిస్తున్నారు.
తన వ్యక్తిగత జీవితం, పెంపకం గురించి రాధిక ఆప్టే మాట్లాడుతూ.. లైంగికత, కోరికల చుట్టూ సమాజం అల్లిన నామోషి, బిడియం, అసౌకర్యాలు లేకుండా తన కూతురు పెరగాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. భవిష్యత్తు తరాలు తమ భావాలను, శారీరక అవసరాలను ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా వ్యక్తపరిచే వాతావరణం రావాలని ఆమె ఆకాంక్షించారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి మహిళకు తన జీవితాన్ని, కోరికలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఉందని రాధికా ఆప్టే కామెంట్స్ మరోసారి స్పష్టం చేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
