ఏపీలో భారీగా విద్యుత్ డిమాండ్ - పవర్ ఎక్ఛేంజ్ లో బుకింగ్స్- వైఎస్ జగన్ కీలక ఆదేశాలు..
వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.
అమరావతి: ఏపీలో వేసవి సమీపిస్తున్న కొద్దీ విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దీంతో పాటే ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఫిబ్రవరి 2వ వారం నుంచే రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇప్పటికే పవర్ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
వేసవిలో విద్యుత్ కొరత ఉండకూడదని అధికారులకు సీఎం జగన్ స్పష్టంచేశారు. విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

రైతులు ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో విద్యుత్ కనెక్షన్ మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు తెలిపారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎం జగన్ వారికి స్పష్టంచేశారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్రంలో 100 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామన్నారు.అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications