YS Jagan : ఎల్లుండి నుంచి వైసీపీ ఎమ్మెల్యేలకు మరో పరీక్ష!
ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ మరో ఏడాదిలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో సాధించిన 151 సీట్ల ఫీట్ ను బ్రేక్ చేసి ఈసారి వై నాట్ 175 పేరుతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల్ని మర్చిపోయి మరోసారి జనం వద్దకు వెళ్లేందుకు ఓ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. జగనన్నే మా భవిష్యత్తు అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడే వీరికి పరీక్ష ఎదురుకానుంది.
గతంలో గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ భారీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో ప్రతీ ఎమ్మెల్యే పాల్గొనాల్సిందేనని జగన్ టార్గెట్ పెట్టారు. అంతే కాదు ఈ కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కూడా ఇవ్వనంటూ చెప్పేశారు. దీంతో మెజారిటీ ఎమ్మెల్యేలు గడప గడపకూ పరుగు తీశారు.

కొన్ని చోట్ల ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. దీన్ని కవర్ చేసుకునేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన వారు తమ సంక్షేమ పథకాలు అందుకున్న వారు కాదని వైసీపీ నేతలు చెప్పుకున్నారు.
కానీ ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అలా చెప్పుకునే పరిస్ధితి ఉండదు. దీంతో తిరిగి జనంలోకి వెళ్లేందుకు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. అయితే గడప గడపకూ ప్రభుత్వం పేరుతో గత ఆరునెలలుగా ఇంటింటికీ తిరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు మరోసారి జనం వద్దకు వెళ్లి ఏం చెప్పబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది.
ఎందుకంటే సంక్షేమం గురించి అందరికీ చెప్పే పరిస్ధితి ఉండదు. విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు వెళ్లి సంక్షేమం గురించి చెప్పినా ఫలితం ఉండదు. కాబట్టి తిరిగి సంక్షేమ పథకాల లబ్ది దారుల ఇళ్లకే వెళ్తారా లేక అందరి వద్దకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తారా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications