కెటిఆర్ ప్రకటన, జగన్‌పై ఒత్తిడి: ఆ జిల్లాల వైసిపి నేతలు అప్‌సెట్
గుంటూరు: ఈ నెల 22న దసరా పర్వదినం నాడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గైర్హాజరు కావాలని నిర్ణయించుకోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల కార్యకర్తలు, నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
జగన్ విభజిత ఏపీ ప్రయోజనాల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలోనే గొణుక్కుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే తాము తప్పకుండా వెళ్తామని తెలంగాణ మంత్రి కెటిఆర్ చెప్పిన విషయం తెలిసిందే.
ఈ రోజు (ఆదివారం) సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కెసిఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి, పిలువనున్నారు. కెసిఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దసరా రోజునే ఆయన ప్రారంభించాలనుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని రావొచ్చని అంటున్నారు.

ఒకవేళ కెసిఆర్ రాకపోయినా కెటిఆర్, ఇతర మంత్రులు, నేతలు వెళ్లే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. కానీ రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత రాజధాని శంకుస్థాపనకు రానని చెప్పడంపై టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో, పార్టీలోనే జగన్ తీరు పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు ఆదివారం సాయంత్రం జగన్‌ను కలిసి మాట్లాడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే విధంగా వారు ఒత్తిడి తెచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications