చంద్రబాబుగారూ! మీకు ఏ శిక్ష విధించినా తక్కువే కదా?: వైఎస్ జగన్ బహిరంగ లేఖ
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. మీది సంక్షేమ ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా అంటూ జగన్ నిలదీశారు.
''చంద్రబాబుగారూ! టీడీపీ మేనిఫెస్టోలో మీరు చెప్పిన శ్రీరంగనీతులేంటి? పాదయాత్రలో మీరు చెప్పిన ప్రవచనాల సంగతేంటి? అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే 24 మద్యం డిపోలు ఉంటే.. కొత్తగా మరో 9 డిపోలను ఏర్పాటు చేస్తుండడం వెనుక అర్థమేంటన్నారు.

మద్యంపై ఈ ఏడాది రూ.17 వేల కోట్లు సంపాదిస్తున్నారని, గత ఏడాది రూ.13,600 కోట్లు సంపాదించారని, అంటే సగటున ఏటా రూ.15 వేల కోట్లు సంపాదిస్తూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఇంత డబ్బు వస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని, రైతు రుణమాఫీకి కేవలం రూ.11 వేల కోట్లే ఇచ్చారని పేర్కొంటూ ''మీది సంక్షేమ ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా? అని జగన్ తన బహిరంగ లేఖలో చంద్రబాబును ప్రశ్నించారు.
''పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తున్న ముదునూరి సుబ్బమ్మ మృతికి మీరు బాధ్యులు కారా? మీ ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యం తట్టుకోలేక ఆమె గుండెపోటుకు గురై మరణించారనే విషయం గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారు..'' అని వైసీపీ అధినేత పేర్కొన్నారు.
బెల్ట్ షాపులను రద్దు చేస్తూ మీరు చేసిన రెండో సంతకం ఏమైంది? మద్యం అమ్మకాలు తగ్గించాలన్నది మా ఉద్దేశం. అలాంటి ఆలోచన మీకు కలగకపోగా, విచ్చలవిడిగా మద్యం అమ్మి కుటుంబాలకు ద్రోహం చేస్తున్నారు అని తన బహిరంగ లేఖలో జగన్ ఆరోపించారు.
''మద్యం తాగుతున్నది అమాయక ప్రజలైనా.. తాగిస్తున్నది మీరు. నేరం చేసిన వాడి కంటే చేయించిన వాడికే ఎక్కువ శిక్ష ఉండాలన్న సూత్రం ప్రకారం మీకు ఏ శిక్ష విధించినా తక్కువే కదా? పద్ధతి మార్చుకోండి చంద్రబాబు గారూ..' అని జగన్ హితవు పలికారు.












Click it and Unblock the Notifications