దేవుడి దయ మొదలు.. షాకిచ్చాక మాట మారింది: జగన్ 'సీఎం' ట్విస్ట్‌లు!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 'ముఖ్యమంత్రి' వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల తర్వాత నేనే సీఎం అని జగన్ చెబుతుంటారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 'ముఖ్యమంత్రి' వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల తర్వాత నేనే సీఎం అని జగన్ చెబుతుంటారు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆ మాట చెబుతారు.
గత ఏడాది ఏకంగా రాజ్ భవన్ ఎదుట.. తన వైపు టిడిపి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పారు. ఆ తర్వాత నుంచి వైసిపి నుంచి టిడిపికి వలకలు మరిన్ని ఎక్కువయ్యాయి.

జగన్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఇలా..
ఈ ఏడాది జనవరి 26వ తేదీన విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన వాగ్వాదం సమయంలోను తాను ఓ కాబోయే ముఖ్యమంత్రిని మీరు అడ్డుకుంటున్నారని హెచ్చరించారు. తాజాగా, కడపలో మరోసారి తాను ముఖ్యమంత్రిని అవుతానని జగన్ చెప్పారు.
రెండు మూడేళ్ల క్రితం రెండేళ్ల తర్వాత తాను సీఎంను అవుతానని, ఆ తర్వాత ప్రభుత్వాన్ని పడగొడతానని, దేవుడి దయ ఉంటే ఈ ప్రభుత్వం కొన్నాళ్లే ఉంటుందని చెప్పిన జగన్.... ఇప్పుడు మాత్రం 2019లోనే ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

ముందస్తును విరమించుకున్నారు
కడపలో మాట్లాడుతూ.. వచ్చే 2019 ఎన్నికల్లో పులివెందులకు ముఖ్యమంత్రి పదవి వస్తుందని చెప్పారు. తద్వారా ఆయన ముందస్తు ఎన్నికల ఆలోచనను విరమించుకున్నారని చెప్పవచ్చు. అయితే, ఇప్పటికే పదేపదే తాను సీఎంను అని చెప్పిన జగన్.. సొంత నియోజకవర్గంలో పులివెందులకు సీఎం పదవి అన్నారు.
2019లో వైసిపి గెలిస్తే ఎలాగూ జగనే ముఖ్యమంత్రి అవుతారు. ఇదిలా ఉండగా, జగన్ పదేపదే అలా చెప్పడం వల్ల ప్రజల్లో చులకన అయి పోతున్నామని పార్టీ నేతలు పదేపదే చెబుతున్నారని అంటున్నారు. కానీ జగన్ తీరులో మార్పు లేదంటున్నారు.

అప్పుడు సంచలనం
ఏడాది కిందట సాదారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉన్నప్పటికీ.. ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని సీఎం అవబోతున్నానని ప్రకటించి సంచలనం రేపారు. ఆ తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలోకి వరుస కట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని జగన్ పడగొడతానని చెప్పడం వల్లే వైసిపి ఎమ్మెల్యేలు దానిని జీర్ణించుకోలేక తమవైపు వచ్చారని టిడిపి చెప్పడం ప్రారంభించింది. ఏడాదిలో ప్రభుత్వాన్ని పడగొడతానన్న జగన్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యేల చేరికతో కౌంటర్ ఇచ్చింది.

ఎమ్మెల్యేలు వెళ్లిపోయాక మాట మారింది
ఒక్కోసారి ఏడాది అని, మరోసారి రెండేళ్లలో.. తానే సీఎంనంటూ చెబుతారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తర్వాత మాత్రం తన ప్రకటనను మరోమాట జత చేస్తున్నారు. దేవుడు దయ తలిస్తే అనే పదాన్ని జతచేసి ఆ తర్వాత తన కోరికను వ్యక్తం చేస్తూ ఉంటారు.
జగన్ పదేపదే అలా చెప్పడంపై టిడిపి విమర్శలు చేస్తోంది. అంతేకాదు,
కొంతమంది సొంత పార్టీ నేతలు కూడా జగన్‌కు పదేపదే అలా ప్రకటించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు భావనలు వెళ్తాయని భావిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా పులివెందులోను అదే మాట్లాడారు. దీంతో అది అరిగిపోయిన రికార్డులా కనిపిస్తోందని అంటన్నారు.












Click it and Unblock the Notifications