అనవసరమని జగన్, తెరాసది అదే: ఇరుపక్షాలని బాబు
హైదరాబాద్: ఈ నెల 5వ తేదీలోపు మంత్రుల బృందం విధివిధానాల పైన అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర హోంశాఖ పార్టీలను కోరిన నేపథ్యంలో పార్టీలలో చర్చలు జరుగుతున్నాయి. అఖిల పక్షానికి వెళ్లాలా లేదా అనే విషయమై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.
కేంద్రం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్నది. గురువారం జగన్ కీలక నేతలతో సమావేశమై చర్చించారు. రాష్ట్ర విభజన చేయాలా? వద్దా? అనే సమావేశమైతే వెళ్లవచ్చునని కానీ, విభజన చేశాం, ఎలా చేయాలో, సమస్యలు చెప్పాలంటే వెళ్లడమెందుకని నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో వారు రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాలని నిర్ణయించారు. ఈ మేరకు వారి అపాయింట్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇరుపక్షాలతో మాట్లాడాలి
రాష్ట్ర విభజనపై ఇరువైపుల వారిని పిలిచి మాట్లాడాలని కేంద్రానికి టిడిపి సూచించనుంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉండటంతో దీనిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శుక్రవారం బాబు వచ్చాక చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అఖిల పక్షంకు వెళ్లే విషయం అధినేత నిర్ణయం తీసుకుంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
'కేంద్రం లేఖ అందింది. మా పార్టీ అధ్యక్షుడు వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటాం' అని యనమల రామకృష్ణుడు విలేకరులతో చెప్పారు. ఇరువైపులా ఉద్యమిస్తున్న వారిని పిలిచి మాట్లాడి ఉభయులకూ ఆమోదయోగ్య పరిష్కారం కనుగొనాలన్న డిమాండును టిడిపి వినిపిస్తోంది.
ప్రతికూలం కాదు
రాష్ట్ర విభజన విషయంలో మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం అనవసరమని తెరాస భావిస్తోంది. అదే సమయంలో అఖిలపక్ష భేటీ పెట్టాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతికూలంగా చూడాల్సిన అవసరంలేదని కూడా అభిప్రాయపడుతోంది. తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే అంశం కాదు కాబట్టి వెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తోంది. బిజెపి కూడా అఖిల పక్షాన్ని ఆహ్వానించింది.












Click it and Unblock the Notifications