జగన్ ఢిల్లీ ఆపరేషన్ వెనుక - తొలి అడుగు..!!
మాజీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో ధర్నాకు సిద్దమయ్యారు. ఎన్నికల్లో ఓడిన తరువాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన జగన్ పార్టీ నేత విజయ సాయిరెడ్డి నివాసంలో బస చేసారు. ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. తమ ధర్నాకు ఇతర పార్టీలు హాజరవుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, జగన్ పక్కా వ్యూహంతోనే ఢిల్లీ కేంద్రంగా ఈ ధర్నా నిర్ణయించినట్లు స్పష్టం అవుతోంది.
ఢిల్లీలో జగన్ ధర్నా
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో నిరసనకు డిసైడ్ అయ్యారు. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీలో హింసాత్మక ఘటనలు, దాడులు, విధ్వంసాలకు నిరసనగా ఈ ధర్నాకు జగన్ పిలుపునిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలు తెలిసేలా ఈ ధర్నా చేపట్టినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ధర్నాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరుగుతున్న హింసలకు సంబంధించిన ఫొటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించనున్నారు.

టైం ఇవ్వండి
వైసీపీకి చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమైన వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి ఏపీలో తాజా రాజకీయాలు, ఢిల్లీలో ధర్నా గురించి వివరించినట్లు సమాచారం. అయితే, టీడీపీ ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామి కావటంతో ప్రధాని, హోం మంత్రి అప్పాయింట్ మెంట్ దొరికే అవకాశం లేదని తెలుస్తోంది.
జగన్ కొత్త లెక్కలు
ఏపీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇక రాజకీయంగా దూకుడుగానే వ్యవహరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఢిల్లీ కేంద్రంగా ఏపీలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ధర్న ద్వారా జాతీయ స్థాయిలో కొత్త సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తమ ధర్నాకు కలిసొచ్చే పార్టీలను ఆహ్వానిస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే..ఇండియ - ఎన్డీఏ కూటమిలతో సంబంధం లేని పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ధర్నాకు వచ్చే స్పందన తరువాత ఢిల్లీ కేంద్రంగా జగన్ తన వ్యూహంలో భాగంగా తదుపరి కార్యాచరణ ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications