తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో ఆల్‌టైమ్ రికార్డ్!
కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాద్రి కొండలలో కొలువైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం కోసం భక్తులు విశేషంగా తిరుమలకు వెళ్తున్నారు. దీంతో తిరుమల గిరులలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీతో పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త ఆల్ టైమ్ రికార్డును సృష్టించాయి. వేసవి సెలవుల నేపథ్యంలో మే నెలలో దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
భక్తుల రద్దీకి తగ్గట్టు లడ్డూ ప్రసాదాల విక్రయం
భక్తుల రాకకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదాల విక్రయం మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో నమోదైందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఈ ఏడాది మే ఒక్క నెలలోనే ఏకంగా 1.21 కోట్లకు పైగా లడ్డూలను భక్తులు కొనుగోలు చేయడం విశేషం. తిరుమల క్షేత్ర చరిత్రలోనే ఒకే నెలలో ఈ స్థాయిలో లడ్డూలు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.

లడ్డూల కొరత రాకుండా టీటీడీ యాజమాన్యం ముందుచూపు
2024 మే నెలలో 1.01 కోట్లు, 2025 మే నెలలో 1.10 కోట్లు విక్రయాలు కాగా, ఈ ఏడాది 1.21 కోట్లకు పైగా లడ్డూలు విక్రయమయ్యాయి. సాధారణంగా మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది. ఈ ఏడాది భక్తులకు లడ్డూల కొరత రాకుండా ఉండేందుకు టీటీడీ యాజమాన్యం ముందుచూపుతో వ్యవహరించింది.
లడ్డూ విక్రయాలు, శ్రీవారి హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణ అన్నీ రికార్డులే
పోటు కార్మికులు మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా శ్రమిస్తూ, ప్రతిరోజూ లక్షలాది లడ్డూలను అందుబాటులో ఉంచారు. అటు కౌంటర్ల వద్ద కూడా భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా అదనపు సిబ్బందిని నియమించి ప్రసాదాల పంపిణీని వేగవంతం చేశారు.కేవలం లడ్డూ విక్రయాలే కాకుండా, మే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణ, గదుల కేటాయింపు ద్వారా కూడా టీటీడీకి భారీగా ఆదాయం సమకూరింది.
సామాన్య భక్తుల కోసం టీటీడీ నిర్ణయాలతో రికార్డు సంఖ్యలో భక్తుల దర్శనం
నిత్య అన్నదాన వితరణలోనూ రికార్డు సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేసి, సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించడం వల్లనే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోగలిగారని, ఫలితంగా లడ్డూ ప్రసాదాల విక్రయాలు కూడా ఈ స్థాయిలో పెరిగాయని అధికారులు చెప్తున్నారు.













Click it and Unblock the Notifications